వరుసగా విఫలం కావడంపై అభిషేక్ శర్మ స్పందన

  • టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడుసార్లు డకౌటైన అభిషేక్ శర్మ
  • తన దూకుడైన ఆటతీరును ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోనని వెల్లడి 
  • రెండేళ్ల క్రితమే ఒత్తిడి తీసుకోవడం మానేశానన్న అభిషేక్‌
టీ20 ప్రపంచకప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు తన ఫామ్‌పై స్పందించాడు. తన దూకుడైన ఆటతీరును ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోబోనని స్పష్టం చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో అభిషేక్‌పై వస్తున్న విమర్శలకు ఈ వ్యాఖ్యలతో చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. 

ప్రస్తుత టోర్నీలో యూఎస్ఏ, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అభిషేక్ పరుగులేమీ చేయకుండానే ఔటయ్యాడు. దీంతో అతడి స్థానంలో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, జట్టు యాజమాన్యంతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతడికి పూర్తి మద్దతు ప్రకటించారు. అభిషేక్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, అతడు కచ్చితంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. 

ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ అభిషేక్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. ‘బ్యాటింగ్‌ను నేను చాలా ఆస్వాదిస్తాను. ఒత్తిడికి గురికావడాన్ని రెండేళ్ల క్రితమే వదిలేశాను. నా చేతుల్లో ఉన్నది కేవలం సాధన చేయడమే. నా ఆటతీరు, మైండ్‌సెట్‌ను మార్చుకోను. ప్రతి బ్యాటర్ కెరీర్‌లో ఇలాంటి ఒడిదొడుకులు సహజం. ఫలితాలు ఎలా ఉన్నా దూకుడుగా ఆడటమే నా శైలి’ అని తేల్చిచెప్పాడు. కాగా, ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్‌ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 


More Telugu News