ఏఐ సమ్మిట్ వద్ద యూత్ కాంగ్రెస్ నిరసనలపై కేటీఆర్ స్పందన
- అంతర్జాతీయ సదస్సులను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడంపై కేటీఆర్ మండిపాటు
- ఇది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్య అని వ్యాఖ్య
- ఇలాంటి వేదికల్లో హుందాగా వ్యవహరించాలని సూచన
ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026 వేదిక వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు చేసిన నిరసనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అంతర్జాతీయ సదస్సులను రాజకీయ ప్రదర్శనలకు ఉపయోగించడం దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్య అని అభివర్ణించారు. అంతర్జాతీయ సదస్సులు దేశ ప్రతిభను, సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించే వేదికలని అన్నారు. ఇలాంటి వేదికల్లో హుందాగా వ్యవహరించాలని చెప్పారు.
రాజకీయ విభేదాలు సహజమే అయినా... అభిప్రాయ భేదాలను వ్యక్తపరచడానికి సరైన సమయం, సరైన వేదిక ఉండాలని కేటీఆర్ అన్నారు. గ్లోబల్ ఈవెంట్‌లలో ఇలాంటి నిరసనలు చేపట్టడం వల్ల భారత్‌పై అంతర్జాతీయంగా ప్రతికూల అభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందని విమర్శించారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేయడం చాలా విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు.