ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయినా సంతోషం లేదన్న ఆసీస్ స్పిన్నర్
- టీ20 ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణ
- చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం
- టోర్నీ నుంచి నిష్క్రమించడంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన జంపా
- శ్రీలంకతో మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాల్సిందని స్వీయవిమర్శ
ఈ మ్యాచ్‌లో తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, ఒమన్‌ను 16.2 ఓవర్లలో కేవలం 104 పరుగులకే కట్టడి చేసింది. మిడిల్ ఓవర్లలో జంపా (4/27) తన స్పిన్‌తో ఒమన్ బ్యాటింగ్ వెన్నెముక విరిచాడు. అనంతరం 105 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (33 బంతుల్లో 64), ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 32) తొలి వికెట్‌కు 93 పరుగులు జోడించి విజయాన్ని సులభతరం చేశారు.
మ్యాచ్ అనంతరం జంపా మాట్లాడుతూ "నిజం చెప్పాలంటే గత కొన్ని రోజులుగా మాకు చాలా కష్టంగా గడిచింది. మా డ్రెస్సింగ్‌రూమ్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం మమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది" అని అన్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తాను మరింత మెరుగ్గా రాణించాల్సిందని, తన వైఫల్యం కూడా జట్టు ఫలితంపై ప్రభావం చూపిందని స్వీయవిమర్శ చేసుకున్నాడు. "గత కొన్నేళ్లుగా ఈ జట్టును నిర్మించాం. కానీ, మా బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించడంలో విఫలమయ్యాం" అని జంపా ఆవేదన వ్యక్తంచేశాడు.