Jaggareddy: ఎన్ని ఆఫర్లు వచ్చినా జీవన్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు.. ఆయనకు అవమానం జరగకూడదు: జగ్గారెడ్డి

జగిత్యాలలో సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డికి రాజకీయంగా ఎన్ని ఆఫర్లు వచ్చినా పార్టీలోనే కొనసాగారని, అలాంటి నాయకుడికి పార్టీలో అవమానం జరగకుండా చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా టిక్కెట్లు ఇచ్చి పార్టీ ఆయనను ప్రోత్సహించిందని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ఆయన ఓడిపోయారని అన్నారు. కానీ ఆయన ఎప్పుడూ పార్టీ గీతను దాటలేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా జీవన్ రెడ్డి పార్టీలోనే కొనసాగారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతానని అన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం జరగకూడదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అధిష్ఠానం చొరవ తీసుకోవాలని అన్నారు.

కాగా, తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవీకాలం వచ్చే ఏప్రిల్ నెలలో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 16న తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరేందుకు జగ్గారెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. పార్టీకి చెందిన మరో సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే అధిష్ఠానానికి లేఖ రాశారు.
Jaggareddy
Jeevan Reddy
Telangana Congress
TPCC
Rajya Sabha Elections
Indian National Congress

More Telugu News