వాడో సైకోపాత్.. ఎప్ స్టీన్ పై బాధితురాలి సంచలన వ్యాఖ్యలు
- ఎస్టేట్ లో బంధించి శారీరక, మానసిక దాడులు చేసేవారన్న బాధితురాలు రీనా
- వచ్చిన అతిథులంతా ముందు మసాజ్ రూమ్ కే వెళతారని వెల్లడి
- ట్రంప్ కు చాలా విషయాలు తెలుసని, ఆయన చాలా చూశారని ఆరోపణ
జెఫ్రీ ఎప్ స్టీన్ సృష్టించిన లైంగిక వేధింపుల సామ్రాజ్యంపై మరో బాధితురాలు రీనా విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. ఎప్‌స్టీన్ కేవలం శారీరక దాడులు మాత్రమే కాకుండా, బాధితులను మానసికంగా లొంగదీసుకుని తన గుప్పిట్లో పెట్టుకునే ‘సైకోపాత్’ అని ఆమె వెల్లడించారు. 1990వ దశకంలో ఆర్ట్ స్టూడెంట్‌గా ఉన్న రీనాకు ఎప్‌స్టీన్ ఒక ‘లైఫ్ లైన్’ లా కనిపించాడు. ‘‘ఎటువంటి షరతులు లేకుండా నీకు స్కాలర్ షిప్ ఇస్తాను, నువ్వు నన్ను మళ్ళీ కలవాల్సిన అవసరం లేదు’’ అని నమ్మించి తన వలలోకి లాగాడని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, ఒకసారి ఆమె అతనిని కలవడానికి నిరాకరించినప్పుడు ‘‘నువ్వు నా మాట వినడం లేదు కాబట్టి నీ సాయాన్ని రద్దు చేస్తున్నాను’’ అంటూ తన అసలు రూపాన్ని బయటపెట్టాడని ఆమె తెలిపారు.
బందీగా మార్చి బెదిరింపులు..
ఫ్లోరిడాలోని ఎప్ స్టీన్ ఎస్టేట్‌లో తనను బంధించిన రోజులను రీనా గుర్తు చేసుకుంటూ.. "నా దగ్గర డబ్బు లేదు, రవాణా సౌకర్యం లేదు, అసలు నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు. ఈ విషయాలు బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్ స్టీన్ నివాసాల్లో ఒక ‘ప్రోటోకాల్’ ఉండేదని, అక్కడికి వచ్చే అతిథులంతా ముందు మసాజ్ రూమ్‌లకే వెళ్లేవారని ఆమె పేర్కొన్నారు.
ట్రంప్ కు చాలా తెలుసు, చాలా చూశారు..
ఎప్ స్టీన్ ఫైళ్లలో పేర్లున్న ప్రతి ఒక్కరినీ విచారించాలని రీనా డిమాండ్ చేశారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావిస్తూ.. "ఆయనకు చాలా విషయాలు తెలుసు, చాలా చూశారు. ఆయన పేరు కూడా ఫైళ్లలో ఉంది, కాబట్టి ట్రంప్ కచ్చితంగా సాక్ష్యం చెప్పాలి" అని ఆమె పేర్కొన్నారు.
ఆండ్రూ అరెస్ట్ ఆరంభమే..
బ్రిటన్ రాజకుటుంబీకుడు ఆండ్రూ మౌంట్ బాటెన్-విండ్సర్ అరెస్ట్ కేవలం ఆరంభం మాత్రమేనని, అమెరికా ప్రభుత్వం కూడా బాధ్యులను శిక్షించాలని ఆమె కోరారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు, శక్తిమంతులు ఈ ఫైళ్లలో ఉన్నారు. వారు తమ లొసుగులతో తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న 20 లక్షలకు పైగా ఫైళ్లను వెంటనే బహిర్గతం చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు. ఎప్ స్టీన్ సృష్టించిన ఈ చీకటి వ్యవస్థ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట కొనసాగుతూనే ఉందని తాను నమ్ముతున్నట్లు రీనా ఆందోళన వ్యక్తం చేశారు.