టీ20 ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ దూరం.. పాక్ కుట్రే కారణమా?

Bangladesh Cricket Team Out of T20 World Cup Due to Pakistan Conspiracy
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందే ఆసియా క్రికెట్‌లో పెద్ద దుమారమే రేగింది. భారత్‌లో పర్యటించేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) కఠిన చర్యలు తీసుకుంది. ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించి, దాని స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది. అయితే, బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కుట్ర ఉందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.

బంగ్లాదేశ్ కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మాజీ సీఈవో సయ్యద్ అష్రఫుల్ హక్ మాట్లాడుతూ.. పాక్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ వేసిన ఉచ్చులో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చీఫ్ అమీనుల్ ఇస్లాం చిక్కుకున్నారని ఆరోపించారు. "భారత్‌లో పర్యటించవద్దని, తాము అండగా ఉంటామని పాక్ బోర్డు హామీ ఇచ్చింది. కానీ ఐసీసీ చర్యలు తీసుకుంటామని హెచ్చరించగానే పాక్ మాట మార్చింది. చివరికి నష్టపోయింది బంగ్లాదేశ్ మాత్రమే" అని ఆయన విశ్లేషించారు.

ఈ వివాదానికి బీజం ఐపీఎల్‌లో పడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడడానికి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారత్ అనుమతించకపోవడంతో బీసీబీ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా భద్రతా కారణాలు చూపి భారత్‌కు వెళ్లబోమని బంగ్లాదేశ్ మొండికేసింది. మొదట బంగ్లాకు మద్దతుగా నిలిచిన పాకిస్థాన్, ఐసీసీ హెచ్చరికలతో వెంటనే యూ-టర్న్ తీసుకుంది.

ఈ రాజకీయాల వల్ల ముస్తాఫిజుర్, లిటన్ దాస్ వంటి సీనియర్ ఆటగాళ్లు తమ చివరి ప్రపంచకప్‌కు దూరమయ్యారని అష్రఫుల్ హక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బంగ్లా స్థానంలో గ్రూప్-సిలో స్కాట్లాండ్ చేరగా, పాకిస్థాన్ తన మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడేందుకు సిద్ధమైంది. తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బంగ్లా బోర్డు చేసిన విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది.
Go Back to Shorts
Bangladesh Cricket
T20 World Cup
Pakistan Cricket Board
Mohsin Naqvi
Aminul Islam
Mustafizur Rahman
Litton Das
ICC
ACC
India

More Telugu News