ఎంఎస్ ధోనీ ఫామ్ హౌస్ నుంచి రాంచీ మార్కెట్‌కు సేంద్రియ టమాటాలు

  • 38 ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వివిధ రకాల టమాటా పంట
  • రెడ్, లోకల్, చెర్రీ, హైబ్రీడ్ రకాల టమాటా పండిస్తున్న ధోనీ
  • ఆవు పేడ, సేంద్రియ పదార్థాల మిశ్రమాన్ని ఎరువుగా వినియోగం
ఝార్ఖండ్ రాజధాని రాంచీ సమీపంలోని సాంబో గ్రామంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫామ్ హౌస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. 38 ఎకరాల్లో ధోనీ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. అందులో భాగంగా వివిధ రకాల టమోటాలను పండిస్తున్నాడు. ధోనీ టమాటా పంట మార్కెట్‌లోకి కూడా వస్తోంది. 

శాస్త్రీయ పద్ధతిలో, అక్కడి నేల, వాతావరణానికి తగ్గ టమోటాను ఎంపిక చేసుకుని పండిస్తున్నాడు. ఇందులో రెడ్, లోకల్, చెర్రీ, హైబ్రిడ్ వంటి రకాలు ఉన్నాయి. రాంచీ హోల్ సేల్, రిటైల్ మార్కెట్‌లలో ఈ టమాటాకు డిమాండ్ ఉంది. ఈ టమాటా పరిమాణం, రుచి, నాణ్యత పరంగా విశిష్ఠంగా ఉండటంతో బయటి నుంచి వచ్చే ట్రేడర్లు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ధోనీ పంటకు ఎలాంటి రసాయన ఎరువులను ఉపయోగించడం లేదు. సంప్రదాయ, సహజ పద్ధతులను ఉపయోగిస్తున్నాడు. ఆవు పేడ, సేంధ్రియ పదార్థాల మిశ్రమాన్ని సహజ ఎరువుగా వినియోగిస్తున్నాడు. టమాటాలతో పాటు క్యాబేజీ, బఠానీలు, బ్రకోలి, గుమ్మడికాయ, బెండకాయ, వంకాయలతో పాటు పైనాపిల్, మామిడి, జామ, బొప్పాయి కూడా పండిస్తున్నాడు.

ఈసారి తాము టమోటా సాగుపై ప్రత్యేకంగా దృష్టి సారించామని ఫామ్ కేర్ టేకర్ తెలిపాడు. సహజ వనరులు, సేంద్రియ ఎరువులతో పండిస్తున్నట్లు వెల్లడించాడు. వాతావరణం అనుకూలంగా ఉండటంతో మంచి దిగుబడి వచ్చిందని, మార్కెట్ నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపాడు.


More Telugu News