Sahibzada Farhan: టీ20 వరల్డ్ కప్: నమీబియాపై భారీ విజయం... సూపర్-8లోకి పాకిస్థాన్

టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది. కొలంబో వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల భారీ తేడాతో పాక్ ఘన విజయం అందుకుంది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (100 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగడం ఈ మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 200 పరుగుల లక్ష్యఛేదనలో నమీబియా 97 పరుగులకే కుప్పకూలింది.

ఈ విజయంతో గ్రూప్-ఏలో టీమిండియా తర్వాత పాకిస్థాన్ 4 మ్యాచ్ ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ నమీబియాపై పాకిస్థాన్ ఓడిపోయి ఉంటే అమెరికా జట్టుకు సూపర్-8 అవకాశం ఉండేది. అయితే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో పాక్ సత్తా చాటింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆరంభంలోనే ఓపెనర్ సయీమ్ అయూబ్ (14) వికెట్‌ను కోల్పోయినా, మరో ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘా (38)తో కలిసి రెండో వికెట్‌కు 67 పరుగులు జోడించాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ఫర్హాన్ కేవలం 58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 100 పరుగులు సాధించాడు. చివర్లో షాదాబ్ ఖాన్ (22 బంతుల్లో 36 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. నమీబియా బౌలర్లలో జాక్ బ్రాసెల్ 2 వికెట్లు తీశాడు.

అనంతరం 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో లౌరెన్ స్టీన్‌క్యాంప్ (23), అలెగ్జాండర్ వోల్షెంక్ (20) మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ కేవలం 16 పరుగులిచ్చి 4 వికెట్లతో సత్తా చాటగా, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ 19 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా చెరో వికెట్ తీశారు.

ఈ భారీ విజయంతో పాకిస్థాన్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని పదిలం చేసుకుని సూపర్ 8 బెర్తును ఖాయం చేసుకుంది. గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే టీమిండియా అర్హత సాధించగా, ఇప్పుడు పాకిస్థాన్ రెండో జట్టుగా ముందంజ వేసింది. మరోవైపు, టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలోనూ ఓడిపోయిన నమీబియా ఇంటిముఖం పట్టింది.
Sahibzada Farhan
Pakistan
T20 World Cup 2026
Namibia
Salman Agha
Super 8
Cricket
Usman Tariq
Shadab Khan
T20 World Cup

More Telugu News