నారా లోకేశ్ ను ప్రశంసించిన ఉండవల్లి అరుణ్ కుమార్
- కోవా బన్ వ్యాపారి వలీకి లోకేశ్ అండగా నిలవడం ప్రశంసనీయమన్న ఉండవల్లి
- విభజన హామీల అమలుకు కేంద్రంపై చంద్రబాబు, పవన్ ఒత్తిడి చేయాలని సూచన
- వైసీపీ నేతలను జైల్లో పెట్టడం వల్ల కూటమికే నష్టమని వ్యాఖ్య
కోవా బన్ వ్యాపారి వలీకి మంత్రి నారా లోకేశ్ అండగా నిలవడం అభినందనీయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు. బీజేపీతో పొత్తులో ఉండి కూడా ముస్లింలకు అండగా ఉండటం మంచి విషయమని ప్రశంసించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన హామీలు ఇంకా అమలు కాలేదని ఉండవల్లి విమర్శించారు. ఏపీకి రావాల్సిన రూ. 80 వేల కోట్ల కోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని అన్నారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఏపీకి న్యాయం జరగలేదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాడటానికి సుప్రీంకోర్టులో ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయాలని కోరారు.
హైదరాబాద్ లో ఉన్న హెరిటేజ్, భారతి సిమెంట్స్ ప్రధాన కార్యాలయాలను అమరావతికి తీసుకురావాలని డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిట్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. లడ్డూ అంశాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు.
వైసీపీ నేతలను జైళ్లలో పెట్టడం వల్ల కూటమికే నష్టం జరుగుతుందని ఉండవల్లి అన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టడం వల్ల జగన్ నష్టపోయారని... వైసీపీ నేతలను జైల్లో పెడితే చంద్రబాబుకే నష్టం జరుగుతుందని చెప్పారు. వైసీపీ తరహాలో కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం వెళ్లకూడదని సూచించారు.