పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడటంపై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు

  • పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదన్న సంజయ్ రౌత్
  • కేంద్ర ప్రభుత్వ దాదాగిరీ వల్లే ఆటగాళ్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం లేదని వ్యాఖ్య
  • ఇండియా-పాక్ మ్యాచ్‌ల వల్ల బెట్టింగుల్లో వేల కోట్లు ఆర్జిస్తున్నారన్న రౌత్
  • ఆ డబ్బుల్లో సగం దావూద్, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులకు చేరుతోందని వ్యాఖ్య

ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగే సమయంలో ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకోకపోవడం పట్ల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఆడాలంటే క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి. షేక్‌హ్యాండ్ ఇవ్వకపోతే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆటగాళ్లపై దాదాగిరీ చేస్తున్నట్లే అవుతుంది. అసలు మీరెందుకు ఆడుతున్నారు? పాకిస్థాన్‌తో ఆడటం పూర్తిగా ఆపేస్తే ఏమవుతుంది?” అని రౌత్ ప్రశ్నించారు.


ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు ఐసీసీ టోర్నీల్లో తలపడిన సమయంలో భారత ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారని... ఇది బీజేపీ, కేంద్ర ప్రభుత్వం దాదాగిరీ వల్లే జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆసియా కప్‌లోనూ, గత ఆదివారం టీ20 వరల్డ్ కప్‌లోనూ ఇదే సీన్ రిపీట్ అయిందని చెప్పారు.


పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్‌లు ఆడడం వల్ల బెట్టింగుల్లో వేల కోట్లు ఆర్జిస్తున్నారని, దీంట్లో సగం డబ్బు పాకిస్థాన్‌కు వెళుతుందని, ఆ డబ్బు నేరుగా దావూద్ ఇబ్రహీం, మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులకు చేరుతుందని, దీని వల్ల ఉగ్రవాదం మళ్లీ బలపడుతుందని రౌత్ ఆరోపించారు.



More Telugu News