Rahul Gandhi: చైనా రోబోను మనదిగా చూపించి అవమానించారు.. చైనా మీడియా ఎగతాళి చేస్తోంది: రాహుల్ గాంధీ

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న 'ఏఐ ఇంపాక్ట్' సదస్సులో గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ విశ్వవిద్యాలయం చైనా రోబోడాగ్‌ను తాము అభివృద్ధి చేసినట్లుగా పేర్కొంటూ ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సదస్సులో నుంచి గల్గోటియాస్ విశ్వవిద్యాలయానికి ఉద్వాసన పలికింది. ఈ వివాదంపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సును అధ్వానంగా నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్ ప్రతిభను ప్రపంచానికి చూపకుండా పీఆర్ స్టంట్ చేస్తున్నారని ఆరోపించారు. భారతీయుల డేటాను అమ్మకానికి పెట్టి చైనా ఉత్పత్తులతో షో చేస్తున్నారని విమర్శించారు. చైనా అభివృద్ధి చేసిన రోబోలను మనవిగా చూపించి అవమానాలకు గురి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ సమ్మిట్‌ను ఒక జోక్‌గా మార్చారని మండిపడ్డారు. భారతదేశం ప్రతిభను కనబర్చాల్సిన చోట ఈ తీరు దారుణమని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏఐ సదస్సు ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని నవ్వులపాలు చేసిందని అన్నారు. చైనా రోబోలను మనవిగా ప్రదర్శించినందుకు ఆ దేశ మీడియా మనల్ని ఎగతాళి చేస్తోందని అన్నారు. ఇది దేశానికి నిజంగా ఇబ్బందికరమైన పరిణామమని అన్నారు.
Rahul Gandhi
AI Impact Summit
China Robot
Galgotias University
Narendra Modi
Indian AI
AI Technology

More Telugu News