Naga Babu: చదువుతో పాటు ఇవి కూడా ఉండాలి... ఈ మేరకు చంద్రబాబు, లోకేశ్ లను కోరుతున్నాను: నాగబాబు

Naga Babu Requests Chandrababu Lokesh for Education Reforms
షార్ట్స్‌లో చూడండి
విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించి, వారిని శారీరకంగా దృఢంగా తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకురావాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కోన నాగబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థుల కోసం 'కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్ (సీజీపీఎస్)' అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. ఆటస్థలాలు లేక నాలుగు గోడల మధ్యే చదువుకు అంకితమవుతున్న విద్యార్థుల శ్రేయస్సు కోసం ఈ చర్యలు అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, "పిల్లల్లో ఉండే అపారమైన శక్తిని సరైన మార్గంలోకి మళ్లిస్తే వారు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. వారంలో కనీసం మూడు రోజులైనా వారికి ఫిజికల్ ఫిట్‌నెస్, ఆటలు, ఇతర సహ పాఠ్యాంశ కార్యకలాపాల్లో శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడిన విషాద సంఘటనలు కూడా ఉన్నాయి. ఆటలు ఆడటం వలన ఈ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా ప్రైవేట్ విద్యాసంస్థలకు సొంతంగా ఆటస్థలాలు లేవని, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం విశాలమైన మైదానాలు అందుబాటులో ఉన్నాయని నాగబాబు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో "కామన్ ప్లే గ్రౌండ్ సిస్టమ్"ను అమలు చేయాలని సూచించారు. ఈ విధానం ద్వారా జిల్లా పరిషత్, మునిసిపల్, కార్పొరేషన్ పాఠశాలల్లోని మైదానాలను ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులు కూడా ఉపయోగించుకోవచ్చని వివరించారు. దీనికోసం ప్రైవేట్ యాజమాన్యాల నుంచి కనీస రుసుము వసూలు చేయాలని, ఆ మొత్తాన్ని సంబంధిత ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బంది నియామకం, మైదానాల నిర్వహణకు వినియోగించాలని సూచించారు. దీనివల్ల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల మధ్య సత్సంబంధాలు, అవగాహన కూడా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

శారీరక దృఢత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లను ఆయన ఆదర్శంగా చూపారు. "70 ఏళ్ల వయసులో కూడా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఎంతో చురుకుగా ఉన్నారు. ప్రతిరోజూ యోగా చేస్తూ ఉత్సాహంగా పరిపాలన సాగిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తూనే మార్షల్ ఆర్ట్స్ సాధన కొనసాగిస్తున్నారు. ఇటీవల 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' అనే అంతర్జాతీయ బిరుదు కూడా పొందారు" అని నాగబాబు ప్రశంసించారు. 

"ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగిన యువత ఈ దేశానికి కావాలి" అన్న స్వామి వివేకానంద మాటలను ఉటంకిస్తూ, మన విద్యార్థులను కేవలం పుస్తకాల పురుగులుగా కాకుండా శారీరకంగా, మానసికంగా బలమైన యువతగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. చదువుతో పాటు ఫిజికల్ ఫిట్‌నెస్, మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, యోగా వంటివి పాఠ్యాంశాల్లో భాగం చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లను సభ ద్వారా కోరుతున్నానని చెబుతూ నాగబాబు తన ప్రసంగాన్ని ముగించారు.
Go Back to Shorts
Naga Babu
Common প্লে গ্রাউন্ড सिस्टम
AP Education System
Chandrababu Naidu
Nara Lokesh
Physical Fitness
Mental Health
Private Schools
Sports in Education
Andhra Pradesh

More Telugu News