దేవుడు మళ్లీ బతికిస్తాడని.. శవంతో నాలుగు రోజులు ఇంట్లోనే జాగారం!

  • కూకట్‌పల్లిలో చనిపోయిన కుమార్తె శవంతో కుటుంబం ప్రార్థనలు
  • దేవుడు మళ్లీ బతికిస్తాడన్న నమ్మకంతో నాలుగు రోజులు ఇంట్లోనే
  • దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • నచ్చజెప్పడంతో స్వగ్రామానికి మృతదేహం తరలించిన పోలీసులు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ విషాదకరమైన ఘటన వెలుగు చూసింది. దేవుడు మళ్లీ బతికిస్తాడనే బలమైన నమ్మకంతో, చనిపోయిన కుమార్తె మృతదేహంతో ఓ కుటుంబం నాలుగు రోజుల పాటు ఇంట్లోనే ప్రార్థనలు చేసింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. కైకలూరుకు చెందిన శమంతకమణి తన ముగ్గురు పిల్లలు జయరాం, శైలజ, సునీతలతో కలిసి కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నారు. ఆమె పిల్లలు ముగ్గురికీ వివాహం కాలేదు. ఇటీవల కుమార్తె శైలజ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.

అయితే, శైలజ మరణాన్ని ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ప్రార్థనలు చేస్తే దేవుడు ఆమెను మళ్లీ బతికిస్తాడని నమ్మారు. మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి, లోపలి నుంచి తాళం వేసుకుని ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. రెండు రోజులు గడిచాక ఆదివారం సాయంత్రం ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, తలుపులు తెరిపించి చూడగా విషయం తెలిసింది. కుటుంబ సభ్యులకు పలు విధాలుగా నచ్చజెప్పి, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. చివరకు వారు ఒప్పుకోవడంతో, మృతదేహాన్ని అంబులెన్స్‌లో వారి స్వగ్రామమైన కైకలూరుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


More Telugu News