Imran Khan: జైల్లో క్షీణిస్తున్న ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం... మాజీ క్రికెటర్ల ఆందోళన

Imran Khan Health Deteriorating in Jail Pakistani Cricketers Worried
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం విషయంలో పాక్ మాజీ క్రికెటర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న తమ 'కెప్టెన్'కు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి, ఒక జాతీయ హీరోగా ఇమ్రాన్‌కు దక్కాల్సిన గౌరవం, వైద్యం అందించాలని వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి మాజీ స్టార్లు సోషల్ మీడియా వేదికగా గళమెత్తారు.

అసలేం జరిగిందంటే, అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటిలో 85 శాతం చూపును కోల్పోయినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. రక్తం గడ్డకట్టడం వల్ల 'సెంట్రల్ రెటినల్ వీన్ ఆక్లూజన్' అనే తీవ్రమైన సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు కేవలం 15 శాతం దృష్టి మాత్రమే మిగిలి ఉందని తెలియడంతో ఆయన అభిమానులు, క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది.

2023 సెప్టెంబర్ నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఏకాంత నిర్బంధంలో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ నుంచే కంటి సమస్యలతో బాధపడుతున్నా, జైలు అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం పాకిస్థాన్ సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లడంతో, కోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ వార్త తెలియగానే పాక్ క్రికెటర్లు స్పందించారు. "రాజకీయాలను పక్కన పెట్టి చూస్తే.. ఆయన మా జాతీయ హీరో. 1992 ప్రపంచ కప్ గెలిపించారు. క్యాన్సర్ హాస్పిటల్ కట్టించారు. అలాంటి వ్యక్తికి సరైన చికిత్స అందించాలి" అని వకార్ యూనిస్ భావోద్వేగంగా కోరారు. షాహిద్ అఫ్రిది, రమీజ్ రాజా వంటి అనేక మంది మాజీ ఆటగాళ్లు కూడా మానవతా దృక్పథంతో స్పందించి, మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Imran Khan
Pakistan
Imran Khan health
Wasim Akram
Waqar Younis
Shoaib Akhtar
Pakistan cricket
Central Retinal Vein Occlusion
Adiala Jail
1992 World Cup

More Telugu News