DDCA: ఢిల్లీ స్టేడియంలో కల్తీ కూల్ డ్రింక్స్? వైరల్ వీడియోపై డీడీసీఏ క్లారిటీ!

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శీతల పానీయాల కల్తీ, పరిశుభ్రత లోపంపై వస్తున్న ఆరోపణలను ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) తీవ్రంగా ఖండించింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ సందర్భంగా తీసినట్లు చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, దానిపై డీడీసీఏ గురువారం స్పష్టతనిచ్చింది.

ఇటీవల నెదర్లాండ్స్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం ఒక వీడియో ఎక్స్ లో చక్కర్లు కొట్టింది. అందులో ఒక విక్రయదారుడు మిగిలిపోయిన కూల్ డ్రింక్స్‌ను మళ్లీ బాటిళ్లలోకి నింపుతున్నట్లు కనిపించింది. దీంతో స్టేడియంలో కల్తీ పానీయాలు అమ్ముతున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఆరోపణలపై డీడీసీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి, ఈవెంట్ మార్గదర్శకాలకు అనుగుణంగానే స్టేడియంకు చెందిన అధీకృత కాంట్రాక్టర్ ఈ పని చేశారని తెలిపింది. "పొడి, తడి చెత్తను వేరు చేసే క్రమంలో, వినియోగించని పానీయాన్ని పారవేసే ముందు బాటిల్‌లోకి తిరిగి పోశారు. ఇది వ్యర్థాల సేకరణ ప్రక్రియలో ఒక భాగం మాత్రమే" అని వివరించింది.

అనంతరం ఆ బాటిళ్లను తమ వేస్ట్ మేనేజ్‌మెంట్, రీసైక్లింగ్ పాలసీ ప్రకారం బాధ్యతాయుతంగా పారవేసినట్లు డీడీసీఏ స్పష్టం చేసింది. తాము స్టేడియంలో అత్యంత కఠినమైన పారిశుద్ధ్య నిబంధనలు పాటిస్తామని, అంగీకరించిన వాణిజ్య ఒప్పందాలు, కార్యాచరణ ప్రమాణాలకు లోబడే కూల్ డ్రింక్స్ సరఫరా జరిగిందని డీడీసీఏ తన ప్రకటనలో పునరుద్ఘాటించింది.
DDCA
Arun Jaitley Stadium
Delhi
T20 World Cup 2026
Cool Drinks Adulteration
Netherlands vs Namibia
Waste Management
Recycling Policy
ICC
Viral Video

More Telugu News