ఎప్‌స్టీన్ నన్ను ‘టూ-ఫేస్డ్’ అన్నాడు: రాహుల్ ఆరోపణలపై హర్దీప్ పూరీ ఎదురుదాడి

  • ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరుందన్న రాహుల్ ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ 
  • ఎప్‌స్టీన్‌ను వృత్తిపరంగా కొన్నిసార్లు కలిశానని స్పష్టీకరణ
  • అతడి నేరాలతో సంబంధం లేదన్న కేంద్ర మంత్రి
  • రాహుల్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇవ్వనున్నట్టు బీజేపీ ప్రకటన
అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరు ఉందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తీవ్రంగా ఖండించారు. ఎప్‌స్టీనే తనను ‘టూ-ఫేస్డ్’ (రెండు నాల్కల ధోరణి ఉన్న వ్యక్తి) అని అభివర్ణించాడని, ఈమెయిళ్లను పూర్తిగా చదివి ఉంటే రాహుల్ ఈ ఆరోపణలు చేసేవారు కాదని ఆయన చురక అంటించారు. బుధవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

బుధవారం లోక్‌సభలో ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో హర్దీప్ పూరీ, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలపై పూరీ స్పందిస్తూ తాను ఎప్‌స్టన్‌ను గత ఎనిమిదేళ్లలో మూడు, నాలుగు సార్లు మాత్రమే కలిశానని అంగీకరించారు. ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారిగా పదవీ విరమణ చేశాక, ఇంటర్నేషనల్ పీస్ ఇనిస్టిట్యూట్ (IPI) ప్రతినిధి బృందంలో భాగంగా వృత్తిపరమైన పనుల మీద మాత్రమే ఆయనను కలిశానని వివరించారు.

ఎప్‌స్టీన్ లైంగిక నేరాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూరీ స్పష్టం చేశారు. "వారి పనులకు నేను సరైన వ్యక్తిని కాకపోవడం వల్లే బహుశా ఎప్‌స్టీన్ నన్ను టూ-ఫేస్డ్ అని అని ఉంటాడు. నాపై బురద జల్లేందుకే రాహుల్ ఈ ఆరోపణలు చేస్తున్నారు" అని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ‘బఫూనరీ’ (విదూషక చర్యలు)గా అభివర్ణించారు. కాగా, సభను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.


More Telugu News