కేంద్ర సహకారంతో వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకెళతాం: ఢిల్లీలో సీఎం చంద్రబాబు

  • కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ
  • వ్యవసాయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సలహాలు కోరానన్న సీఎం
  • దేశ వ్యవసాయ జీడీపీలో ఏపీ వాటా దాదాపు 10 శాతం అని వెల్లడి
  • ఏపీ అవసరాలకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కేంద్రమంత్రి ఆదేశం
  • చంద్రబాబు నాయకత్వంలో ఏపీ హార్టికల్చర్ హబ్‌గా మారిందన్న శివరాజ్ సింగ్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని మరో ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం మార్గనిర్దేశం చేయాలని కోరినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో మంగళవారం సమావేశమయ్యారు. ఈ భేటీ చాలా ఫలప్రదంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. "దేశ వ్యవసాయ జీడీపీలో ఆంధ్రప్రదేశ్ వాటా 9.9 శాతంగా ఉంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రమంత్రి సలహాలు, సూచనలు కోరాను. మా విజ్ఞప్తి మేరకు, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఒక యాక్షన్ ప్లాన్‌, వాల్యూ-ఎడిషన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని శివరాజ్ సింగ్ తన శాఖ అధికారులను ఆదేశించారు" అని వెల్లడించారు. త్వరలో కేంద్ర బడ్జెట్ రానున్న నేపథ్యంలోనే అన్ని శాఖల మంత్రులతో సమావేశమవుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ సమావేశంపై కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా దాదాపు 10 శాతం ఉందని ప్రశంసించారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం హార్టికల్చర్ హబ్‌గా ఎదుగుతోందని, బడ్జెట్‌లో ప్రకటించిన పథకాలను వేగంగా అమలు చేస్తోందని కొనియాడారు.

ఈ భేటీపై సీఎంవో కూడా ప్రకటన చేసింది. అందులో పేర్కొన్న మేరకు... రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో చర్చించారు. సేంద్రీయ సాగుపై ప్రత్యేక దృష్టి సారించామని, 2024-25 సంవత్సరంలో సాగులో రసాయనాల వినియోగం 2.28 శాతం మేర తగ్గించామని చంద్రబాబు ఆయనకు తెలిపారు. 

రసాయన ఎరువుల వాడకం తగ్గించినందున PM-PRANAM ప్రొత్సాహకాలను ఇవ్వాలని కోరారు. కొబ్బరి సాగు అభివృద్ధి చేయడానికి రూ. 200 కోట్ల మేర సాయం చేయాలని, కోకోనట్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు, కర్ణాటక తరహాలో మోడ్రన్ టెండర్ కోకోనట్ మార్కెట్ల ఏర్పాటు, కొబ్బరి రైతులకు ఆధునాతన పద్దతులపై ట్రైనింగ్, నర్సరీల విస్తరణకు సహకరించాలని అన్నారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం పెండింగ్ లో ఉన్న రూ.695 కోట్లు విడుదల చేయాలని, ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టం కింద 2025-26 సీజన్‌లో తోతాపూరి మామిడికి కేంద్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.100 కోట్ల సాయాన్ని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఏపీలో మఖానా డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, కొల్లేరు సరస్సు ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మఖానా సాగుకు అనుకూల వాతావరణం ఉన్నందున ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు.


More Telugu News