అమెరికాలో రద్దీ రోడ్డుపై దిగిన‌ విమానం.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందంటే..!

  • అమెరికాలోని జార్జియాలో రద్దీ రోడ్డుపై విమానం అత్యవసర ల్యాండింగ్
  • ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో పైలట్ నిర్ణయం
  • ల్యాండింగ్ సమయంలో పలు వాహనాలను ఢీకొట్టిన విమానం
అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ విమానానికి పెనుప్రమాదం తప్పింది. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఓ చిన్న విమానాన్ని పైలట్ రద్దీగా ఉన్న రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో విమానం పలు వాహనాలను ఢీకొట్టింది. గెయిన్స్‌విల్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గెయిన్స్‌విల్‌లోని లీ గిల్మర్ మెమోరియల్ ఎయిర్‌పోర్ట్ నుంచి కాంటన్‌లోని చెరోకీ కౌంటీ రీజనల్ ఎయిర్‌పోర్ట్‌కు ఓ శిక్షణ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు. విమానాశ్రయానికి తిరిగి వెళ్లేందుకు విమానంలో తగినంత పవర్ లేకపోవడంతో గెయిన్స్‌విల్‌లోని రద్దీ రహదారిపై అత్యవసర ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ల్యాండింగ్ సమయంలో విమానం కుడి రెక్క ఓ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. అదే సమయంలో విమానం ఇంధన ట్యాంక్ ఊడిపోయి మరో ఎస్‌యూవీ వాహనంపై పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రమాదం తర్వాత పోలీసులు ఆ రహదారిని మూసివేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:10 గంటలకు ఇంజిన్ సమస్యలపై తమకు సమాచారం అందిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) వెల్లడించింది. ఈ ఘటనపై నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (ఎన్‌టీఎస్‌బీ)తో కలిసి దర్యాప్తు జరుపుతామని అధికారులు తెలిపారు.


More Telugu News