అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు.. అయినా జైలుకే!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఒక కేసులో ఊరట లభించినా, ఆయన జైలు నుంచి ఇప్పట్లో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఇవాళ‌ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించారు.

అయితే, ఆయన బెయిల్‌పై విడుదలవుతున్న సమయంలోనే పట్టాభిపురం పోలీసులు మరో కేసులో రంగప్రవేశం చేశారు. గతంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో పీటీ వారెంట్‌పై అంబటిని స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం, ఆయనకు 14 రోజుల పాటు అంటే ఈ నెల‌ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

సీఎంపై వ్యాఖ్యల కేసులో ఈ నెల‌ 1న అరెస్టయిన అంబటి, అప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక కేసులో బెయిల్ వచ్చినా, మరో కేసులో రిమాండ్ పడటంతో పోలీసులు ఆయన్ను తిరిగి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు. కాగా, అంబటి రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 కేసులు నమోదైనట్లు సమాచారం.


More Telugu News