పంజాబ్ సీఎం విదేశీ పర్యటనకు అనుమతినివ్వని కేంద్రం

  • వివాదంగా మారిన పొలిటికల్ క్లియరెన్స్ నిబంధన
  • సీఎంల ఫారిన్ టూర్లకు విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి
  • కక్ష సాధింపు చర్యలంటూ కేంద్రంపై ఆప్ మండిపాటు
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం మరోసారి నీళ్లు చల్లింది. యూరప్ లో పర్యటించేందుకు మాన్ విదేశాంగ శాఖ అనుమతి కోరగా తిరస్కరించింది. దీంతో ముఖ్యమంత్రి మాన్ పర్యటన అర్ధాంతరంగా రద్దయింది. ఇటీవల మాన్ విదేశీ పర్యటనలకు అనుమతి నిరాకరించడం ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

పంజాబ్ ప్రభుత్వం వచ్చే నెలలో నిర్వహించ తలపెట్టిన 'ఇన్వెస్టర్స్ సమ్మిట్' కోసం పెట్టుబడులను ఆహ్వానించడానికి భగవంత్ మాన్ చెక్ రిపబ్లిక్ మరియు నెదర్లాండ్స్‌లో పర్యటించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధి, విద్య, మరియు విదేశీ పంజాబీల సహకారం కోసమే ఈ పర్యటన ఖరారైంది. అయితే కేంద్రం నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.

వివాదాస్పదంగా ‘పొలిటికల్ క్లియరెన్స్’
రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశాల్లో పర్యటించేందుకు విదేశాంగ శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. దీనినే పొలిటికల్ క్లియరెన్స్ గా వ్యవహరిస్తారు. అయితే, ఈ నిబంధన చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. పంజాబ్ విషయానికి వస్తే.. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పర్యటనలపై కేంద్రం వరుసగా ఆంక్షలు విధిస్తోంది. పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో యూకే మరియు ఇజ్రాయెల్ లో పర్యటించేందుకు మాన్ అనుమతి కోరగా నిరాకరించింది. గతంలో పారిస్ ఒలింపిక్స్ సందర్శనకూ ఇలాగే అడ్డుచెప్పడంతో ఆ పర్యటన రద్దయింది. తాజాగా చెక్ రిపబ్లిక్, నెదర్లాండ్స్ పర్యటనకూ మాన్ కు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. అయితే, ఈ అనుమతిని నిరాకరించడానికి గల కారణాలను విదేశాంగ శాఖ బహిరంగంగా వెల్లడించలేదు. ఈ వ్యవహారం ఇప్పుడు కేంద్ర-రాష్ట్ర సంబంధాల మధ్య మరోసారి చిచ్చు రేపింది.

కేంద్రంపై ‘ఆప్’ విమర్శ
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తీవ్రంగా ఖండించింది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆప్ నేతలు మండిపడుతున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశాలకు వెళ్తున్నప్పుడు పంజాబ్ సీఎంకు మాత్రమే అనుమతి ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు.


More Telugu News