మ‌న‌ జట్టు చాలా స్ట్రాంగ్.. టీమ్ యూఎస్‌కు ఆల్ ది బెస్ట్: టీ20 వరల్డ్ కప్‌పై ట్రంప్ పోస్ట్

  • అమెరికా క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్
  • తమది చాలా బలమైన జట్టని కొనియాడిన అధ్యక్షుడు
  • గత వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఎస్‌ఏ
  • భారత్, పాకిస్థాన్‌లతో ఒకే గ్రూప్‌లో ఉన్న అమెరికా
టీ20 ప్రపంచకప్ 2026 సందడి ఇప్పుడు అమెరికాను కూడా తాకింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మెగా టోర్నీపై స్పందించడమే కాకుండా, తమ దేశ జట్టుకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో అమెరికా జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేశారు. "భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతోందని ఇప్పుడే విన్నాను. టీమ్ యూఎస్‌ఏకు నా శుభాకాంక్షలు. మనది చాలా బలమైన జట్టు. అమెరికా మొత్తం మీకు మద్దతుగా నిలుస్తుంది" అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో అమెరికా జట్టు క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రపంచకప్‌లో 2009 ఛాంపియన్ అయిన పాకిస్థాన్‌కు షాకిచ్చి 'జెయింట్ కిల్లర్' అనే పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది టోర్నీలోనూ బలమైన ఆరంభాన్ని అందుకుంది. టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటైన భారత్‌కు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయినప్పటికీ, తన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రస్తుతం ఈ టోర్నీలో అమెరికా జట్టు గ్రూప్ ఏలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. సూపర్ 8 దశకు చేరే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే, అమెరికా తన తదుపరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై తప్పక గెలవాల్సి ఉంటుంది.



More Telugu News