TGSPF: తెలంగాణలో ఆ ఉద్యోగులకు పోలీస్ శాలరీ ప్యాకేజీ.. ఎస్బీఐతో ప్రభుత్వ ఒప్పందం

Telangana Government Offers Police Salary Package to TGSPF Staff
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా సిబ్బందికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ సంస్థలకు భద్రత కల్పిస్తున్న తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (టీజీఎస్పీఎఫ్) సిబ్బందికి కూడా పోలీసు శాలరీ ప్యాకేజీని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని బుద్ధ భవన్‌లో శనివారం టీజీఎస్పీఎఫ్, ఎస్బీఐ మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం (ఎంవోయూ) జరిగింది.

ఈ ఒప్పందం ప్రకారం టీజీఎస్పీఎఫ్ సిబ్బంది ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ. కోటి అందుతుంది. అదే విమాన ప్రమాదంలో మరణిస్తే రూ. కోటీ 60 లక్షలు చెల్లిస్తారు. విధి నిర్వహణలో శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ. 80 లక్షల వరకు పరిహారం అందిస్తారు. విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది పిల్లల ఉన్నత విద్య కోసం రూ. 28 లక్షల వరకు, ఇద్దరు కుమార్తెల వివాహాల కోసం రూ. 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు.

వీటితో పాటు రూ. 10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా ఉంటుంది. కాలిన గాయాల కేసుల్లో ప్లాస్టిక్ సర్జరీకి గరిష్ఠంగా రూ. 10 లక్షలు, అంబులెన్స్ ఖర్చులకు రూ. 50 వేలు, ఎయిర్ అంబులెన్స్ కోసం రూ. 10 లక్షల వరకు చెల్లిస్తారు. ఈ ఒప్పందం ద్వారా సిబ్బందికి పలు రుణ సౌకర్యాలు, లాకర్ అద్దెపై రాయితీలు, ప్లాటినం రూపే డెబిట్ కార్డు వంటి అదనపు ప్రయోజనాలు కూడా లభించనున్నాయి.
Go Back to Shorts
TGSPF
Telangana Government
Telangana police salary package
State Bank of India
SBI
Telangana special protection force
police welfare
insurance scheme
government agreement
security personnel

More Telugu News