రష్యా యూనివర్సిటీలో కత్తితో దాడి.. భారతీయ విద్యార్థి సహా 8 మందికి గాయాలు

  • విదేశీ విద్యార్థులు ఉంటున్న హాస్టల్ స్పోర్ట్స్ హాలులోకి ప్రవేశించిన నిందితుడు
  • అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దాడి
  • తనను తాను కత్తితో గాయపరుచుకున్న నిందితుడు
రష్యాలోని బాష్కోర్తోస్థాన్ రిపబ్లిక్‌లోని ఒక మెడికల్ యూనివర్సిటీ హాస్టల్‌లో కత్తితో దాడి జరిగిన ఘటనలో ఒక భారతీయుడు సహా ఎనిమిది మంది గాయపడ్డారు. ఒక టీనేజ్ కుర్రాడు కత్తితో వైద్య విశ్వవిద్యాలయంలో విదేశీ విద్యార్థులు ఉంటున్న హాస్టల్‌లోని స్పోర్ట్స్ హాలులోకి ప్రవేశించి అక్కడున్న విద్యార్థులపై దాడి చేశాడు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడు పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో వారిపై కూడా దాడికి పాల్పడ్డాడని, తనను తాను కూడా కత్తితో గాయపరుచుకున్నాడని రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇరినా వోల్క్ తెలిపారు. నిందితుడిని 15 ఏళ్ల టీనేజర్ గా గుర్తించారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన విద్యార్థులందరూ ఏ దేశానికి చెందిన వారో తెలియరాలేదు. స్థానిక కథనాల ప్రకారం ఒక భారతీయ విద్యార్థి ఉన్నారు. కత్తితో దాడికి పాల్పడిన నిందితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పిల్లల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


More Telugu News