టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజల కలకలం

  • శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, తెల్ల నువ్వులు చల్లి వెళ్లిన వైనం
  • కారును వెంబడించిన ఎమ్మెల్యే అనుచరులు
  • పోలీసులకు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే అనుచరులు  
ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద నిమ్మకాయలు, తెల్లనువ్వులు పడేసి వెల్లడం తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురవుతున్నారు. 

తాజాగా ఓ స్విఫ్ట్ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి అక్కడి నుంచి వెళ్లిపోతుండటాన్ని గమనించిన ఎమ్మెల్యే అనుచరులు వెంటనే వారిని వెంబడించేందుకు ప్రయత్నించగా, కారు అతివేగంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ కారుకు ఏపీ 39 కేఎక్స్ 0986 నంబర్ ఉన్నట్లు గుర్తించారు. 

ఇటీవలి కొన్ని నెలలుగా తమ ఇంటి వద్ద ఇదే తరహా ఘటనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనల కారణంగా తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక శింగనమల నియోజకవర్గానికి చెందిన ఓ అసమ్మతి నేత హస్తం ఉండొచ్చని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారని వారు ఆరోపించారు. 

ఈ ఘటనపై ఎమ్మెల్యే అనుచరుల ఫిర్యాదు మేరకు అనంతపురం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నంబర్‌తో పాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.
 


More Telugu News