Revanth Reddy: ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు... తెలంగాణ 'వాట్సాప్ మీ-సేవ' సూపర్ సక్సెస్

Telangana WhatsApp Meeseva Receives Overwhelming Response
  • ఇప్పటివరకు 3.25 లక్షల మందికి పైగా అందిన డిజిటల్ సేవలు
  • ఒకే వాట్సాప్ నంబర్‌తో 581 రకాల ప్రభుత్వ, ఆలయ సేవలు
  • త్వరలో అత్యవసర సేవలను కూడా అనుసంధానించేందుకు ఏర్పాట్లు
  • మీ-సేవ కేంద్రాల్లో 5.98 కోట్ల లావాదేవీలతో రికార్డు
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'వాట్సాప్ మీ-సేవ' విధానానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు చేర్చే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ డిజిటల్ సేవలకు విశేష ఆదరణ లభిస్తోందని, ఇప్పటికే 3.25 లక్షల మందికి పైగా పౌరులు దీని ద్వారా లబ్ధి పొందారని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 4.5 లక్షల మంది ఈ సేవ కోసం తమ నంబర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది.

ప్రభుత్వ కార్యాలయాలు, మీ-సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పౌరులు తమ అరచేతిలోని ఫోన్‌తోనే సేవలు పొందేలా ఈ విధానాన్ని రూపొందించారు. గతేడాది నవంబర్ 18న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సేవలను ప్రారంభించారు. పౌరులు 8096958096 అనే వాట్సాప్ నంబర్‌కు 'Hi' అని సందేశం పంపడం ద్వారా 10కి పైగా ప్రభుత్వ శాఖలకు చెందిన 581 రకాల సేవలను 24 గంటలూ పొందవచ్చు.

ఈ సేవలను వినియోగించుకుంటున్న వారిలో అత్యధికులు కులం, ఆదాయం, జనన, మరణ ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవడం, సర్టిఫికెట్లను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడం వంటివి కూడా దీని ద్వారా సాధ్యమవుతున్నాయి. ఇంటర్నెట్‌పై పెద్దగా అవగాహన లేనివారు సైతం సులభంగా వాట్సాప్ ద్వారా సేవలు పొందుతుండటం దీని విజయానికి కారణమైంది.

ప్రభుత్వ సేవలతో పాటు రాష్ట్రంలోని 31 ప్రముఖ దేవాలయాలకు సంబంధించిన సేవలను కూడా ఈ వాట్సాప్ నంబర్‌తో అనుసంధానించారు. దర్శనం టికెట్లు, వసతి గదుల బుకింగ్ వంటివి కూడా దీని ద్వారానే చేసుకునే సౌలభ్యం కల్పించారు. భవిష్యత్తులో 108, 101, 102 వంటి అత్యవసర సేవలను కూడా ఈ నంబర్‌కు అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5 వేల మీ-సేవా కేంద్రాల ద్వారా 2023 నవంబర్ 1 నుంచి 2026 జనవరి 31 వరకు 5.98 కోట్ల లావాదేవీలు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ.3,811 కోట్లు అని ప్రభుత్వం పేర్కొంది.
Revanth Reddy
Telangana
WhatsApp Meeseva
e-governance
digital services
government services
birth certificate
death certificate
income certificate
caste certificate

More Telugu News