Donald Trump: అమెరికాలో ముదిరిన 'వీడియో' వివాదం.. క్షమాపణలు చెప్పేందుకు ట్రంప్ ససేమిరా!

Donald Trump Refuses to Apologize for Racist Obama Video
  • ఒబామా దంపతులపై జుగుప్సాకరమైన వీడియో పోస్ట్
  • సిబ్బంది పొరపాటేనని వైట్ హౌస్ సమర్థన
  • సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామాను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఒక జాతి వివక్ష వీడియో ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను తుపాను సృష్టిస్తోంది. ఈ వివాదంపై మొదటిసారి స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆ వీడియోలో ఉన్న అభ్యంతరకర భాగాన్ని తాను చూడలేదని, కేవలం ఓటింగ్ యంత్రాల అక్రమాలకు సంబంధించిన మొదటి భాగాన్ని మాత్రమే చూసి సిబ్బందికి ఇచ్చానని ఆయన సమర్థించుకున్నారు.

ట్రంప్ అధికారిక 'ట్రూత్ సోషల్' ఖాతాలో గురువారం రాత్రి పోస్ట్ అయిన ఈ నిమిషం నిడివి గల వీడియోలో.. ఒబామా దంపతుల ముఖాలను ఏఐ సాంకేతికతతో కోతుల శరీరాలకు తగిలించి అత్యంత దారుణంగా చిత్రీకరించారు. సుమారు 12 గంటల పాటు ఆన్‌లైన్‌లో ఉన్న ఈ వీడియోపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవ్వడంతో చివరికి తొలగించారు. మొదట దీనిని కేవలం ఒక 'మీమ్' అని కొట్టిపారేసిన వైట్ హౌస్ వర్గాలు, ఆ తర్వాత సిబ్బంది చేసిన పొరపాటుగా అభివర్ణించాయి.

ఈ ఘటనపై డెమొక్రాట్లే కాకుండా రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా భగ్గుమంటున్నారు. సెనేట్‌లోని ఏకైక నల్లజాతి రిపబ్లికన్ నేత టిమ్ స్కాట్ ఈ వీడియోను "అత్యంత జుగుప్సాకరమైనది"గా అభివర్ణించారు. సొంత పార్టీ ఎంపీలు మైక్ లాలర్, సుసాన్ కాలిన్స్ వంటి వారు కూడా ట్రంప్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, రోజుకు వేల సంఖ్యలో విషయాలను చూస్తుంటానని, ఇందులో తన తప్పేమీ లేదని ట్రంప్ మొండిగా సమాధానమివ్వడం గమనార్హం.
Donald Trump
Barack Obama
Michelle Obama
racist video
US politics
Truth Social
Tim Scott
Republican Party
AI technology
election fraud

More Telugu News