US-India Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. భారత వస్తువులపై అదనపు సుంకం ఎత్తివేత

US India Trade Deal Tariffs Reduced on Indian Goods
  • భారత వస్తువులపై 18 శాతానికి సుంకాలు తగ్గించిన యూఎస్
  • అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకారం
  • రాబోయే 5 ఏళ్లలో 500 బిలియన్ డాలర్ల అమెరికా వస్తువుల కొనుగోలుకు భారత్ నిర్ణయం
భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ ఇరు దేశాలు కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా భారత వస్తువులపై అమెరికా తన సుంకాలను 18 శాతానికి తగ్గించింది. గతంలో విధించిన అదనపు 25 శాతం సుంకాన్ని కూడా ఉపసంహరించుకోవడం గమనార్హం. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి కొత్త ఊతాన్ని ఇవ్వనుంది.

ఈ ఒప్పందం ప్రకారం అమెరికా నుంచి దిగుమతి అయ్యే పలు పారిశ్రామిక ఉత్పత్తులతో పాటు వ్యవసాయ, ఆహార వస్తువులపై భారత్ సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించనుంది. ఇందులో డ్రైడ్ డిస్టిలర్స్ గ్రెయిన్స్, పశువుల దాణా కోసం ఉపయోగించే ఎర్ర జొన్నలు, నట్స్, పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్ వంటివి ఉన్నాయి. అదే సమయంలో భారత్ నుంచి ఎగుమతి అయ్యే టెక్స్‌టైల్స్, దుస్తులు, లెదర్, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు, ఆర్గానిక్ కెమికల్స్, గృహాలంకరణ వస్తువులు, చేతివృత్తి ఉత్పత్తులపై అమెరికా 18 శాతం సుంకాన్ని వర్తింపజేస్తుంది.

సుంకాలతో పాటు వాణిజ్యానికి అడ్డంకిగా ఉన్న నాన్-టారిఫ్ బ్యారియర్స్ (సుంకేతర అవరోధాలు)ను కూడా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా అమెరికా వైద్య పరికరాలకు భారత మార్కెట్‌లో ప్రవేశాన్ని సులభతరం చేయడంతో పాటు యూఎస్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) వస్తువులపై ఉన్న దిగుమతి లైసెన్సింగ్ నిబంధనలను భారత్ రద్దు చేయనుంది.

ఈ ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం రాబోయే ఐదేళ్లలో భారత్ అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. ఇందులో ఇంధనం, విమానాలు, వాటి విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు వంటివి ఉంటాయి. ఈ మధ్యంతర ఒప్పందం పూర్తిస్థాయిలో అమలైతే, భారత జనరిక్ మందులు, వజ్రాలు, విమాన భాగాలపై ఉన్న సుంకాలను కూడా అమెరికా ఎత్తివేయనుంది. పూర్తిస్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) కోసం చర్చలు కొనసాగిస్తామని, భవిష్యత్తులో మరిన్ని సుంకాల తగ్గింపును పరిశీలిస్తామని ఇరు దేశాలు ప్రకటించాయి.
US-India Trade Deal
India US trade
trade deal
tariffs
Indian exports
American imports
Nirmala Sitharaman
US trade policy
Bilateral Trade Agreement
ICT products

More Telugu News