India Under 19: ఆరోసారి విశ్వవిజేతగా భారత్... అండర్19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై గ్రాండ్ విక్టరీ

India Under 19 Wins World Cup Title for 6th Time
  • అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం
  • కేవలం 80 బంతుల్లో 175 పరుగులతో విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
  • భారీ లక్ష్యఛేదనలో ఫల్కనర్ (115) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి
  • టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శనతో అపజయం ఎరుగకుండా టైటిల్ నెగ్గిన టీమిండియా
అండర్-19 క్రికెట్‌లో భారత యువ జట్టు మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. హరారే వేదికగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 100 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా రికార్డుస్థాయిలో ఆరోసారి అండర్-19 ప్రపంచకప్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించి, ఆపై బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది.

భారత్ నిర్దేశించిన 412 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. బెన్ డాకిన్స్ (66), బెన్ మేయస్ (45) వేగంగా పరుగులు సాధించారు. అయితే, భారత బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఒక దశలో 177 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ సమయంలో కాలెబ్ ఫల్కనర్ (67 బంతుల్లో 115) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో అద్భుత శతకం బాది ఒంటరి పోరాటం చేశాడు. అతనికి జేమ్స్ మింటో (28) నుంచి కొంత సహకారం లభించినా, అది గెలుపునకు సరిపోలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ పోరాటం 40.2 ఓవర్లలో 311 పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబ్రీష్ 3 వికెట్లతో సత్తా చాటగా, కనీష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతని ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోరుకు బలమైన పునాది పడింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే (53) బాధ్యతాయుతమైన అర్ధశతకంతో రాణించగా, వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30), వికెట్ కీపర్ అభిగ్యాన్ కుండు (40) విలువైన పరుగులు జోడించారు. చివర్లో కనీష్క్ చౌహాన్ (20 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో 3 వికెట్లు తీశాడు.

భారత్ గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో అండర్-19 కప్ ను గెలిచింది. ఇప్పుడు రికార్డు స్థాయిలో ఆరోసారి కప్ సాధించి, అండర్-19 ప్రపంచకప్‌ చరిత్రలో తన తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు త్రివర్ణ పతాకాలను చేతబూని మైదానంలో సంబరాలు జరుపుకున్నారు.
India Under 19
U19 World Cup
India vs England
Vaibhav Suryavanshi
Ayush Matre
RS Ambreesh
Cricket
Caleb Falconer
Harare

More Telugu News