HYDRAA: నగరంలో కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం.. బోరబండ, సుమారుకుంటలో భారీ ఆక్రమణల తొలగింపు

HYDRAA Cracks Down on Encroachments in Hyderabad
  • నగరంలో ఆక్రమణలపై హైడ్రా కొరడా
  • సుమారుకుంట చెరువు పరిధిలో 11 ఎకరాల ఆక్రమణలు తొలగింపు
  • బోరబండలో 3.20 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం
  • నాగారంలో శివాలయం భూమికి కబ్జా నుంచి రక్షణ
హైదరాబాద్ నగరంలో ఆక్రమణలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపింది. శుక్రవారం నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా చెరువు శిఖం, ప్రభుత్వ, ఆలయ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించింది.

సుమారుకుంట చెరువుకు విముక్తి
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా, దుండిగల్-గండిమైసమ్మ మండలం, దూలపల్లి గ్రామంలోని సుమారుకుంట చెరువు వద్ద హైడ్రా అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టీఎల్) పరిధిలో అక్రమంగా నిర్మాణాలు వెలిశాయి. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో మట్టిని నింపి, స్క్రాప్ దుకాణాలు, హోటళ్లు, కంటైనర్ల తయారీ షాపులు, వెల్డింగ్ దుకాణాల వంటి తాత్కాలిక షెడ్లు నిర్మించారు. వర్షాకాలంలో వరద ముంపునకు కారణమవుతాయనే ఉద్దేశంతో ఈ నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. శిఖం పట్టా భూముల్లో నీరు లేనప్పుడు వ్యవసాయం చేసుకోవచ్చు కానీ, శాశ్వత నిర్మాణాలు చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.

ప్రభుత్వ భూమి స్వాధీనం
ఫెన్సింగ్ ఏర్పాటు మరోవైపు, ఖైరతాబాద్ మండలం యూసుఫ్‌గూడ పరిధిలోని బోరబండలో 3.20 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. సర్వే నంబర్ 128/1లో ఉన్న ఈ భూమిని గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌సీ) చట్టం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే, యూఎల్‌సీ క్లియరెన్స్ వచ్చినట్లు షరీఫ్ ఖాన్ అనే వ్యక్తి నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. దీనిపై హైడ్రా అధికారులు బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆక్రమణలో ఉన్న ఇసుక, ఇటుక వ్యాపారాల షెడ్లను తొలగించి, స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

ఆలయ భూమికి రక్షణ
అలాగే, కీసర మండలం నాగారం, రామకృష్ణ నగర్‌లోని శివాలయానికి చెందిన 1,365 గజాల స్థలాన్ని కూడా హైడ్రా కాపాడింది. 2017లో 400 గజాల్లో ఆలయాన్ని నిర్మించగా, మిగిలిన స్థలం ఖాళీగా ఉంది. ఈ భూమిని కొందరు స్థానికులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు, ఆ భూమి ఆలయానికి చెందినదేనని నిర్ధారించుకున్నారు. వెంటనే ఆ స్థలంలో 'ఈ భూమి దేవాలయానికి చెందినది' అని బోర్డులు ఏర్పాటు చేసి కబ్జాదారుల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేశారు. నగరంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటం, ప్రభుత్వ ఆస్తులను రక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతాయని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
HYDRAA
Hyderabad Disaster Response and Asset Protection Agency
Telangana
encroachments
Sumarukunta Lake
Bora Banda
government land
temple land
illegal constructions
Dundigal

More Telugu News