Rajasthan: రాజస్థాన్‌లో షాకింగ్ ఘటన.. వెండి నగల కోసం వృద్ధురాలిని మంచంతో సహా ఎత్తుకెళ్లిన దొంగలు

Rajasthan Thieves Lift Woman 90 Along With Cot To Loot Silver Jewellery
  • కిలోన్నర వెండి నగల కోసం 90 ఏళ్ల వృద్ధురాలి కిడ్నాప్
  • మంచంతో సహా ఎత్తుకెళ్లి పొలంలో పడేసిన దొంగలు
  • అప్రమత్తమైన కుటుంబసభ్యులు, గ్రామస్థులు.. విఫలమైన చోరీ యత్నం
  • రాజస్థాన్‌లో వరుస ఘటనలతో గ్రామీణ మహిళల్లో తీవ్ర ఆందోళన
వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, దొంగలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిన ఓ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. సుమారు కిలోన్నర బరువున్న వెండి ఆభరణాల కోసం 90 ఏళ్ల వృద్ధురాలిని ఆమె పడుకున్న మంచంతో సహా ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్‌ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే... భిల్వారా జిల్లా అర్వాడ్ ప్రాంతంలోని కోఠియా గ్రామంలో మాజీ సర్పంచ్ నత్తి దేవి మాలి ఇంట్లోకి బుధవారం రాత్రి దొంగలు చొరబడ్డారు. ముందుగా ఇంట్లోని వారిని గదుల్లో బంధించి బయట గడియ పెట్టారు. ఆ సమయంలో వరండాలో మంచంపై నిద్రిస్తున్న నత్తి దేవి అత్తగారైన 90 ఏళ్ల ఛోటీ దేవిని గమనించారు. ఆమె ఒంటిపై భారీగా వెండి ఆభరణాలు ఉండటంతో నోరు నొక్కి మంచంతో పాటు సమీపంలోని పొలంలోకి ఎత్తుకెళ్లారు. అక్కడ ఆమె కాళ్లు, చేతులు కట్టేసి నగలు దోచుకునేందుకు ప్రయత్నించారు.

ఇంతలో గదుల్లో బంధించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో చుట్టుపక్కల గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. గదుల తాళాలు పగలగొట్టి వారిని బయటకు తీశారు. ఇంట్లో ఛోటీ దేవి కనిపించకపోవడంతో వెంటనే గాలింపు చేపట్టగా, పొలంలో నిస్సహాయ స్థితిలో పడి ఉన్న వృద్ధురాలిని గుర్తించారు. అయితే, గ్రామస్థులు అప్రమత్తమవడంతో దొంగలు నగలు తీసుకోకుండానే పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఈ మధ్యకాలంలో వెండి ధరలు విపరీతంగా పెరగడమే ఇలాంటి నేరాలకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మంగళవారం సవాయ్ మాధోపూర్ జిల్లాలో వెండి కడియాల కోసం ఓ మహిళ కాళ్లను నరికి చంపేశారు. ఈ వరుస ఘటనలతో గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Rajasthan
Choti Devi
Rajasthan crime
silver jewelry theft
Bhildwara district
old woman robbery
crime news
Arwad village
Kothiya village
theft incident
police investigation

More Telugu News