K Kavitha: పెద్ద నాయకులు పార్టీని గాలికి వదిలేసినట్లుగా ఉంది: బీఆర్ఎస్ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

K Kavitha Slams BRS Leaders for Neglecting Party
షార్ట్స్‌లో చూడండి
పెద్ద నాయకులు బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేసినట్లుగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్‌పై, ఆ పార్టీ ముఖ్య నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీసీల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలో వద్దో బీసీలే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ప్రముఖంగా కనిపించడం లేదని అన్నారు. ఆ పార్టీ నేతలు ఎవరూ కిందిస్థాయిలో క్రియాశీలకంగా లేరని విమర్శించారు. కృష్ణార్జునులు రాష్ట్రమంతా ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. వారిద్దరూ రాష్ట్రస్థాయిలో ప్రచారం చేయడం లేదంటే రాష్ట్రస్థాయి నాయకులు కానట్లే కదా అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ తన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేసిన మాధవరెడ్డికి ఆ పార్టీ టిక్కెట్ ఎలా కేటాయించిందని నిలదీశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని హితవు పలికారు. బీసీ సబ్ ప్లాన్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలు ప్రశ్నిస్తారని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని అన్నారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిడుతున్నారని అన్నారు. నేను కేసీఆర్‌కు మద్దతివ్వడం లేదని, మర్యాదపూర్వక వాతావరణం ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఆవిర్భావానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని కవిత వెల్లడించారు. పార్టీ ఏర్పాటు ప్రక్రియ మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని అన్నారు.
Go Back to Shorts
K Kavitha
BRS Party
Telangana Jagruthi
Revanth Reddy
BC Reservations
Municipal Elections Telangana

More Telugu News