Gaddam Prasad Kumar: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ.. తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు తుది గడువు

Gaddam Prasad Kumar Given Final Deadline by Supreme Court on Defector MLAs
  • ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌కు చివరి అవకాశం
  • నిర్ణయం తీసుకునేందుకు మూడు వారాల గడువు
  • గడువులోగా తేల్చకుంటే కోర్టు ధిక్కరణేనని హెచ్చరిక
  • బీఆర్ఎస్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు సుప్రీంకోర్టు చివరి అవకాశమిచ్చింది. ఈ అంశంపై మూడు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైన గడువు విధించింది. నిర్ణీత గడువులోగా నిర్ణయం ప్రకటించకపోతే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌ల ధర్మాసనం ఇవాళ‌ విచారణ జరిపింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో ఇప్పటికే స్పీకర్‌కు చాలా సమయం ఇచ్చామని గత విచారణలో వ్యాఖ్యానించిన కోర్టు, ఈసారి మరింత కఠినంగా వ్యవహరించింది.

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే విచారణ జరుపుతున్నారని కోర్టుకు తెలిపారు. ఒక ఎమ్మెల్యే పిటిషన్‌పై విచారణ పూర్తయిందని, మరో ఇద్దరిపై ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం కావాలని ఆయన కోరారు.

ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, తుది అవకాశంగా మూడు వారాల గడువు మంజూరు చేసింది. ఈ గడువు తర్వాత తదుపరి విచారణ జరుపుతామని పేర్కొంటూ, కేసును మూడు వారాలకు వాయిదా వేసింది.
Gaddam Prasad Kumar
Telangana Speaker
MLA Disqualification
Supreme Court
BRS Petition
Party Defection
Telangana Politics
Abhishek Singhvi

More Telugu News