YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో కీలక ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు

YS Vivekananda Reddy Murder Case Supreme Court Orders Key Investigation
  • హత్య రోజు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య సమాచార మార్పిడి
  • దీనిపై దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి సీబీఐ కోర్టు ఉత్తర్వులు 
  • ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు
  • కొత్త సమాచారం ఇవ్వడానికి సునీతకు స్వేచ్ఛనిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం
  • తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య జరిగిన రోజు కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల మధ్య జరిగిన సమాచార మార్పిడిపై తదుపరి విచారణ జరిపే క్రమంలో కొత్త విషయాలపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకు ఉంటుందన్న ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అదనపు సాక్ష్యాధారాలు, కొత్త సమాచారం ఉంటే సీబీఐకి ఇవ్వడానికి వివేకా కుమార్తె సునీతకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. 

వివేకా హత్య జరిగిన రోజు ఈ కేసులో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, మరో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య జరిగిన సమాచారం మార్పిడిపై నెల రోజుల లోపు దర్యాప్తు పూర్తి చేయాలని గత డిసెంబర్ 10న సీబీఐ కోర్టు ఉత్తర్వులిచ్చింది. 

అయితే, కేసు దర్యాప్తును వారిద్దరి మధ్య జరిగిన సమాచార మార్పిడికే పరిమితం చేయకుండా, కొత్త విషయాలు వెలుగులోకి వస్తే వాటిపై కూడా దర్యాప్తు చేసేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో సునీత తాజాగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ సుందరేశ్, జస్టిస్ ఎన్.కె.సింగ్ లతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. సునీత వినతులపై సానుకూలంగా స్పందించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. 

గత నెల 20న జరిగిన విచారణ సందర్భంగా... పిటిషనర్ సునీత కోరుతున్నట్టుగా ఈ హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా? ఈ విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేయాలా? చెప్పాలంటూ ధర్మాసనం ప్రశ్నించింది. నిన్న విచారణ సందర్భంగా సీబీఐ తరపు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ దీనిపై స్పందిస్తూ... సీబీఐ కోర్టు ఉత్తర్వుల మేరకు తదుపరి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో ధర్మాసనం స్పందిస్తూ... మీరు దర్యాప్తును కొనసాగించండి, ఎవరినైనా విచారించే స్వేచ్ఛ మీకుంది, ఎవరినైనా విచారించాలని అనుకుంటే తమకు చెబితే ఆ మేరకు ఉత్తర్వుల్లో మార్పులు చేస్తామని చెప్పింది.  

ఈ సందర్భంగా సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందిస్తూ... ఒక కోణంలో మాత్రమే దర్యాప్తు చేసేందుకు సీబీఐ కోర్టు ఆదేశించిందని చెప్పారు. ఈ కేసుల్లో మినీ ట్రయల్స్ నిర్వహించుకుంటూ వెళ్లలేమని... తీర్పును హైకోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఇస్తే దానికి మరో రెండు, మూడేళ్లు పడుతుందని తెలిపారు. దీంతో జస్టిస్ సుందరేశ్ స్పందిస్తూ... మున్ముందు ఏదైనా అవసరమైతే అప్పుడు మీ వాదనలను పరిశీలిస్తామని చెప్పారు. సీబీఐకి కొంత సమయం ఇద్దామని, ఏం చేస్తుందో చేయనివ్వండని అన్నారు. కొత్త ఆధారాలు ఉంటే సీబీఐకి పిటిషనర్ ఇవ్వొచ్చని తెలిపారు.
YS Vivekananda Reddy
Viveka murder case
Sunitha Reddy
CBI investigation
Supreme Court
Kiran Yadav
Arjun Reddy
Andhra Pradesh politics

More Telugu News