లైంగిక వేధింపుల కేసు.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కు హైకోర్టులో ఊరట

  • అరవ శ్రీధర్ పై ఫిర్యాదు చేసిన ఓ మహిళా ఉద్యోగి
  • హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అరవ శ్రీధర్
  • శ్రీధర్ వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్ వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35(3) నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అరెస్ట్ వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే... తప్పనిసరిగా రాతపూర్వకంగా కారణాలను నమోదు చేయాలని ఆదేశించింది. 

విచారణ సందర్భంగా అరవ శ్రీధర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ... రాజకీయ దురుద్దేశంతోనే శ్రీధర్ పై కేసు నమోదు చేశారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్టయింది. 

కేసు వివరాల్లోకి వెళితే... ఓ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు శ్రీధర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే, తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఎమ్మెల్యే తొలి నుంచి వాదిస్తున్నారు. మరోవైపు, పార్టీ పరంగా కూడా ఈ విషయంపై జనసేన అధిష్ఠానం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించిన సంగతి తెలిసిందే.


More Telugu News