Telangana: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్.. రెండో వాహనంపై అదనపు పన్ను రద్దు

Revanth Reddy Government Cancels Additional Tax on Second Vehicles in Telangana
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించనుంది. రెండో వాహనం కొనుగోలుపై విధిస్తున్న 2 శాతం అదనపు జీవితకాల పన్నును (లైఫ్‌ట్యాక్స్‌) రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రవాణా శాఖ పంపిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండో వాహనం కొనేవారు అదనంగా 2 శాతం పన్ను చెల్లిస్తున్నారు. ఉదాహరణకు రూ.1.20 లక్షల విలువైన బైక్‌ను రెండో వాహనంగా కొంటే రూ.2,400 అదనంగా కట్టాల్సి వస్తోంది. ఈ విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ మొత్తం ఆదాయం తగ్గినా, ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుంది.

కాలుష్య నియంత్రణలో భాగంగా రెండో వాహనాల కొనుగోళ్లను నిరుత్సాహపరిచేందుకు గతంలో ఈ పన్నును ప్రవేశపెట్టారు. అయితే, చాలామంది ఈ పన్నును త‌ప్పించుకోవడానికి తమ కుటుంబసభ్యుల పేర్ల మీద వాహనాలు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీనివల్ల బీమా క్లెయిమ్‌ల సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'వాహన్'లో చేరాలని నిర్ణయించింది. ఈ పోర్టల్‌లో ఒక వ్యక్తికి ఇదివరకే వాహనం ఉందో లేదో గుర్తించేందుకు ప్రత్యేక ఆప్షన్ లేదు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించడం ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఈ అదనపు పన్నును రద్దు చేయడమే సరైన మార్గమని రవాణా శాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదనకు సీఎం అంగీకరించడంతో వాహనదారులకు త్వరలోనే శుభవార్త అందనుంది.
Go Back to Shorts
Telangana
Revanth Reddy
Vehicle Tax
Second Vehicle Tax
Life Tax
Transport Department
Vahan Portal
Vehicle Registration
Telangana Government
Motor Vehicle

More Telugu News