డబ్ల్యూపీఎల్-2026 ఫైనల్... టాస్ గెలిచిన ఆర్సీబీ.. టాస్ ఓడిపోవడమే మంచిదన్న డీసీ కెప్టెన్

మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. వడోదరలోని కోటంబి బీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఈ టైటిల్ క్లాష్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇరు జట్లూ మార్పుల్లేకుండానే ఈ ఫైనల్లో తలపడుతున్నాయి.

2024లో విజేతగా నిలిచిన ఆర్సీబీ రెండో టైటిల్‌పై కన్నేయగా, వరుసగా మూడుసార్లు రన్నరప్‌గా నిలిచి ఫైనల్ ఫోబియాను అధిగమించాలని ఢిల్లీ పట్టుదలగా ఉంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించగా, ఎలిమినేటర్‌లో గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి ఢిల్లీ క్యాపిటల్స్ తుదిపోరుకు చేరుకుంది.

టాస్ గెలిచిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో ఛేజింగ్ ఒక ట్రెండ్‌గా ఉంది. మంచి వికెట్‌పై లక్ష్యం ఎంత ఉందో తెలిసి బరిలోకి దిగడం ఎప్పుడూ మంచిదే. ఫైనల్స్‌లో ఉండే ఉత్కంఠను స్వీకరించాలని జట్టు సభ్యులతో చర్చించాం" అని వివరించారు.

మరోవైపు, ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ మాట్లాడుతూ.. "ఇలాంటి పెద్ద మ్యాచ్‌లలో టాస్ ఓడిపోవడమే మంచిది. మేము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం, కానీ బ్యాటింగ్ చేయడం సంతోషంగా ఉంది. ఎలిమినేటర్ ఆడిన పిచ్‌పైనే మళ్లీ ఆడుతుండటం మాకు కలిసొచ్చే అంశం" అని తెలిపారు. ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఎలిమినేటర్ కోసం ఉపయోగించిన పిచ్ నంబర్ 5పైనే నిర్వహిస్తున్నారు. బౌండరీలు చిన్నవిగా ఉండటంతో బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


More Telugu News