Chintakayala Vijay: ఆ నమ్మకంతోనే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: చింతకాయల విజయ్

Chintakayala Vijay Says AP Receiving Investment Influx Due to Strong Confidence
  • దేశంలోనే 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ నెంబర్ వన్ అని వెల్లడి
  • మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్న విజయ్
  • గత ప్రభుత్వంతో పోలిస్తే క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని వివరణ
  • అమరావతి, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో రాష్ట్రానికి కొత్త గుర్తింపు అని ఉద్ఘాటన
కూటమి ప్రభుత్వంపై ఏర్పడిన బలమైన నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దేశవ్యాప్తంగా వచ్చిన సర్వేల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర నాయకత్వం, పాలనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఇది మాటల ప్రచారం కాదని, గణాంకాలే నిదర్శనమని స్పష్టం చేశారు.

దేశంలోని మొత్తం పెట్టుబడుల్లో సుమారు 25.3 శాతంతో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని, పెట్టుబడుల ఆకర్షణలో ముంబయి, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను కూడా అధిగమించిందని విజయ్ వివరించారు. గతంలో భయపడి పారిపోయిన పెట్టుబడిదారులు ఇప్పుడు పోటీపడి రాష్ట్రానికి రావడం కూటమి ప్రభుత్వంపై విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఈ అభివృద్ధి కారణంగానే గత ప్రభుత్వంతో పోలిస్తే రాష్ట్రంలో తలసరి ఆదాయం 12 శాతం పెరిగిందని తెలిపారు. పరిశ్రమలు, ఉద్యోగాలు పెరిగితేనే ఇది సాధ్యమని, ఇది కూటమి పాలన ఫలితమేనని అన్నారు.

ఉద్యోగాల కల్పన విషయంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని విజయ్ తెలిపారు. మాటల్లో కాకుండా చేతల్లో ఉద్యోగాలు చూపించిన నాయకత్వం తమదని, గత పాలనలో నిరుద్యోగులను మోసం చేసిన పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మహిళలపై అఘాయిత్యాలు, అరాచకాలు పెరిగిపోయాయని, ఐదేళ్లు రాజకీయ కుతంత్రాలతోనే గడిచిపోయాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చట్టపాలన అమలవుతోందని, నేరస్తులు భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఫలితంగా క్రైమ్ రేటు గణనీయంగా తగ్గిందని చెప్పారు.

రాజధాని అమరావతిని మళ్లీ అభివృద్ధి పథంలో పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని విజయ్ అన్నారు. ఒకప్పుడు నిరసనలతో ఉన్న అమరావతి, ఇప్పుడు ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతోందో గూగుల్ మ్యాప్‌లో చూస్తే తెలుస్తుందన్నారు. విశాఖలో ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించడం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. గాజువాక స్టీల్ ప్లాంట్‌కు నిధులు విడుదల చేయించి ఆ ప్రాంత అభివృద్ధికి బాటలు వేశారని గుర్తుచేశారు. విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తూ, తెలుగు ప్రజలు గర్వపడేలా పాలన సాగిస్తున్నారని చింతకాయల విజయ్ పేర్కొన్నారు.

More Telugu News

Chintakayala Vijay
Andhra Pradesh investments
AP development
Nara Lokesh
Mega DSC
Amaravati
Green Hydrogen Hub Visakhapatnam
AP economy
TDP government
AP crime rate