రెండున్నర గంటలపాటు సాగిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం

  • ముగిసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ భేటీ 
  • వైసీపీ కుట్రలు, కూటమి సమన్వయంపై ప్రధానంగా చర్చ
  • రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పదవుల భర్తీపై సమాలోచనలు
  • క్షేత్రస్థాయిలో ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య అమరావతిలో జరిగిన కీలక భేటీ ముగిసింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కూటమి పక్షాల మధ్య సమన్వయం, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

ప్రధానంగా, వైసీపీ అనుసరిస్తున్న వైఖరి పైనే ఈ సమావేశంలో ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కుల రాజకీయాలను రెచ్చగొట్టడం ద్వారా వైసీపీ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని, ఆ పార్టీ పన్నుతున్న వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఇరువురు నేతలు నిర్ణయించుకున్నారు. వైసీపీ ట్రాప్‌లో పడకుండా కూటమి శ్రేణులను అప్రమత్తం చేసేందుకు ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగాలని తీర్మానించుకున్నారు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య వైసీపీ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చారు.

ఈ భేటీలో రాజకీయ అంశాలతో పాటు పరిపాలనాపరమైన విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీపై నేతలు ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. అలాగే, చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లతో పాటు డైరెక్టర్ల నియామకంపై కూడా సమాలోచనలు జరిపారు.

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం వంటి అంశాలపై వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న విష ప్రచారాన్ని సమష్టిగా తిప్పికొట్టాలని, ఇందుకోసం కూటమిలోని మూడు పార్టీల నేతలు కలిసి ఉమ్మడి మీడియా సమావేశాలు నిర్వహించాలని పవన్ సూచించినట్లు సమాచారం. రాబోయే 15 ఏళ్లు కూటమే అధికారంలో కొనసాగేలా పటిష్టమైన భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలనే దిశగా కూడా వీరి మధ్య చర్చలు సాగినట్లు తెలుస్తోంది.

నిన్న కేబినెట్ భేటీకి ముందు చంద్రబాబు, పవన్ క్లుప్తంగా మాట్లాడుకున్నప్పటికీ, అన్ని అంశాలపై విపులంగా చర్చించేందుకు ఈరోజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 



More Telugu News

Chandrababu Naidu Pawan Kalyan Andhra Pradesh politics TDP Janasena YSRCP alliance strategy Rajya Sabha seats nominated posts Amaravati