ఆ గేమ్‌కు బానిసయ్యారు.. చివరి టాస్క్ ఆత్మహత్య: ఘజియాబాద్ అక్కాచెల్లెళ్ల తండ్రి వ్యాఖ్యలు
- రెండున్నరేళ్లుగా ఆన్‌లైన్ గేమ్‌కు బానిసయ్యారన్న తండ్రి
- ముగ్గురు కూతుళ్లు కుటుంబానికి కూడా దూరమయ్యారన్న తండ్రి
- వారి వద్ద ఎప్పుడూ ఫోన్లు ఉండేవని, గదుల్లోనే ఉండేవారన్న తండ్రి
ఈ కొరియన్ ఆన్‌లైన్ గేమ్‌లో చివరి టాస్క్ ఆత్మహత్య అని తండ్రి మీడియాకు తెలిపారు. రెండున్నరేళ్లుగా ఈ గేమ్‌కు బానిసైన తన కూతుళ్లు క్రమంగా కుటుంబానికి కూడా దూరమయ్యారని అన్నారు. వారి వద్ద ఎప్పుడూ ఫోన్లు ఉండేవని, గదుల్లోనే ఉంటూ గేమ్ ఆడేవారని తెలిపారు. వారిలో ఒకరు ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటే, మిగతా ఇద్దరూ ఆదేశాలను పాటించే వారని తెలిపారు.
బుధవారం తెల్లవారుజామున ముగ్గురు అక్కాచెల్లెళ్లు బాల్కనీలోకి వెళ్లి తలుపు గడియ వేసి కిటికీలో నుంచి కిందకు దూకారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ బాలికలు కిందపడిపోవడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు పక్క ఫ్లాట్ వ్యక్తి వెల్లడించారు. రాత్రి రెండు గంటల సమయంలో నేను బాల్కనీలోకి వచ్చానని ఆ సమయంలో వారు బాల్కనీలోనే ఉన్నారని, కానీ అక్కడ కూర్చున్నది ఎవరో తనకు అర్థం కాలేదని తెలిపారు. ఆ తర్వాత వారు కిందకు దూకుతుండటం చూసి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసేలోపు ఒకరి తర్వాత ఒకరు దూకేశారని అన్నారు. ఆ తర్వాత తాను పోలీసులకు, అంబులెన్స్‌కు ఫోన్ చేశానని వెల్లడించారు.