Loan App: రూ.3 వేల లోన్ కోసం వేధింపులు.. హైదరాబాద్ లో వ్యక్తి సూసైడ్

Hyderabad Man Commits Suicide Over Loan App Threats
  • లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం బలి
  • న్యూడ్ ఫొటోలు ఆన్ లైన్ లో పెడతామని బెదిరింపులు
  • మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్న వ్యక్తి.. చిక్కడపల్లిలో దారుణం
లోన్ యాప్ వేధింపులకు మరో ప్రాణం పోయింది. కేవలం రూ.3 వేల కోసం ఫోన్లు చేస్తూ బెదిరింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. హైదరాబాద్ లోని చిక్కడపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిక్కడపల్లిలో నివాసం ఉండే ప్రేమ్ కుమార్ గతంలో ఓ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు. రూ.3 వేల రుణం తిరిగి చెల్లించకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్ ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేస్తున్నాడు.

ఇటీవల మేడారం జాతరకు వెళ్లిన ప్రేమ్ కుమార్ కు తిరుగు ప్రయాణంలో లోన్ యాప్ ఏజెంట్ల నుంచి ఫోన్ వచ్చింది. తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా వెంటనే చెల్లించాలని ఏజెంట్ డిమాండ్ చేశాడు. వెంటనే చెల్లించకపోతే ప్రేమ్ కుమార్ ఫొటోలను న్యూడ్ గా మార్చి కుటుంబ సభ్యులకు పంపడంతో పాటు ఆన్ లైన్ లో పెడతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమ్ కుమార్.. బుధవారం తానుండే అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

More Telugu News

Loan App
Loan App Harassment
Suicide
Prem Kumar
Hyderabad
Chikkadpally
Online Loan
Instant Loan
Cyber Crime