Melinda Gates: ఎప్స్‌టీన్‌ ఫైల్స్ పై బిల్ గేట్స్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు

Melinda Gates Comments on Epstein Files Controversy
షార్ట్స్‌లో చూడండి
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాజీ భార్య, ప్రముఖ దాత మెలిండా ఫ్రెంచ్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్‌టీన్‌కు సంబంధించిన కొత్త ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు రావడం తన వైవాహిక జీవితంలోని అత్యంత బాధాకరమైన రోజులను గుర్తుకు తెస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వివాదం నుంచి తాను బయటపడినందుకు సంతోషంగా ఉన్నానని, అయితే ఆ ఆరోపణలకు బిల్ గేట్స్ సహా అందులో పేర్లు ఉన్నవారే సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.

తాజాగా ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో మెలిండా మాట్లాడుతూ.. "ఈ వివరాలు బయటకు వచ్చినప్పుడల్లా వ్యక్తిగతంగా నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అవి నా వైవాహిక జీవితంలోని కొన్ని అత్యంత బాధాకరమైన సమయాలను గుర్తుకు తెస్తాయి. ఈ వ్యవహారంపై నాకు మాటల్లో చెప్పలేని విచారం ఉంది. అక్కడ మిగిలి ఉన్న ప్రశ్నలకు, అందులో ఉన్న వ్యక్తులు, నా మాజీ భర్త కూడా జవాబుదారీగా ఉండాలి. ఆ విషయాలకు వారు సమాధానం చెప్పాలి, నేను కాదు" అని పేర్కొన్నారు. తాను ఆ బంధం నుంచి బయటపడాలనుకున్నానని, చివరకు ఫౌండేషన్ నుంచి కూడా వైదొలగాల్సి వచ్చిందని, ఇదంతా విచారకరమని ఆమె అన్నారు.

అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన జెఫ్రీ ఎప్స్‌టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 2013లో రష్యన్ యువతులతో లైంగిక సంబంధాల వల్ల బిల్ గేట్స్‌కు సుఖ వ్యాధి (STD) సోకిందని, దాని కోసం అవసరమైన మందులను తాను సమకూర్చానని ఎప్స్‌టీన్ రాసుకున్న కొన్ని డ్రాఫ్ట్ ఈ-మెయిల్స్‌లో ఉంది. ఈ విషయాన్ని అప్పటి భార్య మెలిండా నుంచి దాచిపెట్టడానికి గేట్స్ ప్రయత్నించారని కూడా అందులో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. "ఇవి పూర్తిగా అసంబద్ధమైనవి, నిరాధారమైనవి. నిరూపితమైన అబద్ధాలకోరు నుంచి వచ్చిన ఆరోపణలివి" అని కొట్టిపారేశారు. గేట్స్‌తో సంబంధాలు కొనసాగించలేకపోతున్నాననే నిరాశతో, ఆయనను బ్లాక్‌మెయిల్ చేయడానికి ఎప్స్‌టీన్ ఎంతకైనా తెగిస్తాడని ఈ పత్రాలు నిరూపిస్తున్నాయని గేట్స్ ప్రతినిధి వివరించారు.

గతంలో కూడా బిల్ గేట్స్, ఎప్స్‌టీన్ మధ్య సంబంధాలపై వార్తలు వచ్చాయి. అయితే దాతృత్వ ప్రాజెక్టుల కోసమే తాము కొన్నిసార్లు కలిశామని గేట్స్ చెబుతూ వచ్చారు. కానీ, ఓ రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్‌తో గేట్స్‌కు ఉన్న సంబంధాన్ని బయటపెడతానని ఎప్స్‌టీన్ బెదిరించినట్లు గతంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. కాగా, లైంగిక నేరాలకు పాల్పడిన ఎప్స్‌టీన్ 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బిల్ గేట్స్, మెలిండా 27 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2021లో విడాకులు తీసుకున్నారు. మెలిండా తాజా ఇంటర్వ్యూ క్లిప్‌ను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో 'వావ్' అనే క్యాప్షన్‌తో పంచుకోవడం గమనార్హం.


Go Back to Shorts
Melinda Gates
Bill Gates
Epstein Files
Jeffrey Epstein
Melinda divorce
Bill Gates allegations
Russian women
sexual relationships
sex trafficking
Gates Foundation

More Telugu News