నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ దారికొస్తుంది: రవిచంద్రన్ అశ్విన్

  • మ్యాచ్ జరిగితే చూడాలని ఆసక్తిగా ఉందన్న రవిచంద్రన్ అశ్విన్
  • మ్యాచ్ జరగకుంటే పాకిస్థాన్ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక
  • ఇరుజట్ల మధ్య తటస్థ వేదికల్లో మ్యాచ్‌లు కాబట్టి వేదిక సమస్య కాదని వ్యాఖ్య
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట పాకిస్థాన్ వివాదం వేళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్, పాకిస్థాన్ మధ్య వంద శాతం మ్యాచ్ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. నాలుగైదు రోజుల్లో దాయాది దేశం దారికి వస్తుందని అభిప్రాయపడ్డాడు.

వంద శాతం ఇరుదేశాల మధ్య మ్యాచ్ జరుగుతుందని ఆయన అన్నాడు. ఒకవేళ పాకిస్థాన్, భారత్ మధ్య మ్యాచ్ జరగకుంటే ఆ దేశం భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. బ్రాడ్‌కాస్టర్లు కూడా పెద్ద మొత్తంలో నష్టపోతారని, ఆ ప్రభావం అన్ని దేశాల క్రికెట్ బోర్డులపై పడుతుందని అన్నాడు. ఐసీసీ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వస్తుందని పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) కోసం విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు రావని చెప్పాడు.

భారత్, పాకిస్థాన్ ఇప్పటికే తటస్థ వేదికల్లో పోటీ పడుతున్నాయని, కాబట్టి ఇక్కడ ఇరుదేశాల మధ్య మ్యాచ్‌లకు వేదిక అనేది కారణం కాదని పేర్కొన్నాడు. ఒక ప్రత్యర్థితో ఆడనని చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నాడు. పాకిస్థాన్‌కు ఆ దేశమే శత్రువని, ఇందుకు వారి మైండ్ సెట్ కారణమని అన్నాడు. కాగా, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచ కప్ 2026 భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. అయితే బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.


More Telugu News

Ravichandran Ashwin India Pakistan match T20 World Cup 2026 cricket Pakistan cricket ICC