ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారు క్రికెట్ సంఘాలలో సభ్యులా?: తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

  • బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియని వారిని సంఘాల్లోకి ఎలా తీసుకుంటారన్న సుప్రీంకోర్టు
  • క్రికెటర్ల వల్లే క్రికెట్ సంఘాలు ఉన్నాయి తప్ప నిర్వాహకుల వల్ల కాదన్న వ్యాఖ్య 
  • అసోసియేషన్ సభ్యత్వాన్ని విస్తరించాలనుకుంటే మాజీ క్రికెటర్లకు సభ్యత్వాలు కేటాయించి ఉండాల్సిందన్న సీజేఐ
క్రీడల్లో అనుభవం లేని వ్యక్తులు సంబంధిత క్రీడా సంఘాలను నిర్వహించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని వారు క్రికెట్ సంఘాలకు నాయకత్వం వహించడాన్ని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. మాజీ ఆటగాళ్లే ఇలాంటి సంస్థలకు నేతృత్వం వహించాలని పేర్కొంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలపై బాంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం విచారించింది. 

ఈ ఏడాది జనవరి 6న ఎంసీఏ ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఎన్నికల ముందు దాదాపు 401 మందిని కొత్తగా సభ్యులుగా చేర్చడం ద్వారా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ క్రికెటర్‌, బీజేపీ నేత కేదార్ జాదవ్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కొత్తగా చేర్చిన సభ్యుల్లో చాలామంది ఎన్‌సీపీ - ఎస్‌పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్‌కు సమీప బంధువులు, వ్యాపార భాగస్వాములేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో బాంబే హైకోర్టు ఎంసీఏ ఎన్నికలపై స్టే విధించింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. 

రికార్డులను పరిశీలించిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 1986 నుంచి 2023 వరకు ఎంసీఏలో కేవలం 164 మంది సభ్యులు మాత్రమే ఉన్నారని, ఆ తర్వాత ఒక్కసారిగా సభ్యుల సంఖ్య భారీగా పెరగడంపై 2023 తర్వాత ఏదైనా బంపర్ డ్రా తీశారా? అంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్లను ప్రశ్నించారు. అసోసియేషన్ తన సభ్యత్వాన్ని విస్తరించాలనుకుంటే, ఆ స్థానాలను మాజీ అంతర్జాతీయ క్రికెటర్లకు కేటాయించి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. 

మన దేశంలో అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారని, మాజీ ఆటగాళ్లు సభ్యులుగా ఉండటం మంచిదని అభిప్రాయపడ్డారు. ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారు, కనీసం బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని వారిని సంఘాల్లోకి తీసుకుంటున్నారని ఆక్షేపించారు. క్రికెటర్ల వల్లే క్రికెట్ సంఘాలు ఉన్నాయి తప్ప నిర్వాహకుల వల్ల కాదని సీజేఐ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు ధర్మాసనం అనుమతినిస్తూ ఈ అంశంపై తిరిగి బాంబే హైకోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్లకు సూచించింది. 


More Telugu News

Supreme Court Cricket Associations BCCI Indian Cricket Maharashtra Cricket Association MCA Elections Rohit Pawar Kedar Jadhav Bombay High Court Sports Governance