వరుసగా నాలుగోసారి ఫైనల్లో ఢిల్లీ: గుజరాత్‌పై ఘనవిజయం.. మరోసారి ఆర్‌సీబీతోనే ఫైట్!

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ను 7 వికెట్ల తేడాతో మట్టికరిపించి, వరుసగా నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఇంకా 26 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించారు.

లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఓపెనర్లు లిజెల్ లీ (43), షఫాలీ వర్మ (31) ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరును 75 పరుగులకు చేర్చి విజయాన్ని ఖాయం చేశారు. ఆ తర్వాత కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ (23 బంతుల్లో 41) తన ట్రేడ్‌మార్క్ షాట్లతో స్పిన్నర్లను ఆటాడుకుంది. లారా వోల్వార్డ్ (32*) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బెత్ మూనీ (62*) ఒంటరి పోరాటం చేయగా, జార్జియా వేర్హామ్ (35) చక్కని సహకారం అందించింది. ఢిల్లీ బౌలర్లలో చిన్నెల్ హెన్రీ 3 వికెట్లు తీసి గుజరాత్ పరుగుల వేగానికి బ్రేకులు వేసింది.

ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఢిల్లీ తలపడనుంది. 2024 సీజన్ ఫైనల్‌లోనూ ఈ రెండు జట్లే తలపడగా, అప్పుడు ఆర్‌సీబీ విజేతగా నిలిచింది. దీంతో ఈసారి ఢిల్లీ పాత బాకీ తీర్చుకుంటుందా? లేక ఆర్‌సీబీ మరోసారి టైటిల్ ఎగురేసుకుపోతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. 


More Telugu News