వ్యాపారిని హెల్మెట్లతో కొట్టి చంపిన డెలివరీ బాయ్స్

దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కనాట్ ప్లేస్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యాపారిని ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్ హెల్మెట్లతో కొట్టి చంపారు. ఈ ఘటనలో శివమ్ గుప్తా (36) అనే వ్యాపారి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వాగ్వాదంతో మొదలైన గొడవ ఈ హత్యకు దారితీసింది.

పోలీసుల వివరాల ప్రకారం, జనవరి 3వ తేదీ రాత్రి శివమ్ గుప్తాకు, ముగ్గురు ఫుడ్ డెలివరీ బాయ్స్ కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితులు హెల్మెట్లతో శివమ్‌పై విచక్షణారహితంగా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న శివమ్‌ను ఆసుపత్రికి తరలించారు. దాదాపు 16 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన శివమ్, జనవరి 19న మృతి చెందాడు.

మృతుడు శివమ్ గుప్తా, పహాడ్‌గంజ్‌లో వ్యాపారం చేసే అనిల్ కాంత్ గుప్తాకు ఏకైక కుమారుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
"నాకు నా కొడుకే సర్వస్వం. మాకు న్యాయం జరగాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి దుస్థితి మరే కుటుంబానికీ రాకూడదు" అని శివమ్ తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటన దిల్లీలో తీవ్ర కలకలం రేపింది.


More Telugu News