Visakhapatnam Steel Plant: నష్టాల నుంచి లాభాల బాట పట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్... సీఎం చంద్రబాబు స్పందన

Visakhapatnam Steel Plant Returns to Profitability CM Chandrababu Reacts
  • రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరిన ఉత్పత్తి సామర్థ్యం
  • రూ.54 కోట్ల లాభం సాధించిన ఆర్ఐఎన్ఎల్
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అనూహ్య ప్రగతి
  • విశాఖ ఉక్కుకు పూర్తి సహకారం అందిస్తామన్న సీఎం చంద్రబాబు
ఒకప్పుడు తీవ్ర నష్టాలతో మూసివేత అంచులకు చేరిన విశాఖ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) మళ్లీ లాభాల బాట పట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కేవలం ఏడాదిన్నర కాలంలోనే అనూహ్య ప్రగతి సాధించి, ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షలో అధికారులు ప్లాంట్ పనితీరును సీఎంకు వివరించారు. 2024-25 రెండో త్రైమాసికంలో రోజుకు కేవలం 9,215 టన్నులుగా ఉన్న ఉక్కు ఉత్పత్తి, ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పూర్తిస్థాయిలో పనిచేస్తుండటంతో రోజుకు 19,401 టన్నులకు చేరిందని తెలిపారు. దీంతో ప్లాంట్ సామర్థ్య వినియోగం 45 శాతం నుంచి రికార్డు స్థాయిలో 94 శాతానికి పెరిగింది. ఈ ప్రగతి ఆర్థిక ఫలితాల్లోనూ స్పష్టంగా కనిపించింది. 2024 సెప్టెంబర్‌లో రూ.486 కోట్ల నష్టాన్ని నమోదు చేసిన ఆర్ఐఎన్ఎల్, 2026 జనవరి నాటికి రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.11,000 కోట్ల ఆర్థిక సహాయం ప్లాంట్‌ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని, దీంతో సంస్థ క్రెడిట్ రేటింగ్ కూడా మెరుగుపడిందని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి విశాఖ ఉక్కును మరింతగా విజయపథంలో నడపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర స్టీల్ సెక్రటరీ సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


More Telugu News

Visakhapatnam Steel Plant
RINL
Chandra Babu Naidu
Vizag Steel Plant
Andhra Pradesh
Steel Production
Indian Economy
Manish Raj Gupta
Sandeep Poundrik
Vijayanand