గ్లామర్ ప్రపంచం నుంచి సనాతన ధర్మం వైపు మళ్లిన అందాల భామ!

  • ఆధ్యాత్మిక మార్గం పట్టిన మాజీ నటి ఇషికా తనేజా
  • 'మహాలక్ష్మి భారత్ అభియాన్' పేరుతో దేశవ్యాప్త ప్రచారం ప్రారంభం
  • సమాజంలోని కీలక వర్గాలను అష్టలక్ష్ములతో అనుసంధానించడమే లక్ష్యమని వెల్లడి
ఒకప్పుడు ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచంలో తళుకులీనిన అందాల రాణి, మాజీ మిస్ ఇండియా ఇషికా తనేజా ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్నారు. భౌతిక సుఖాలు, సినీ రంగంలోని పేరు ప్రఖ్యాతులను వదిలిపెట్టి ఆమె సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు సాధ్విగా మారారు. ఇటీవలే ద్వారకా శారదా పీఠం శంకరాచార్య సదానంద సరస్వతి మహారాజ్ నుంచి గురు మంత్ర దీక్ష స్వీకరించి, "సాధ్వి ఇషికా తనేజా"గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 2025లో జరిగిన మహా కుంభమేళాలో పవిత్ర స్నానం చేసి తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. 

ప్రస్తుతం ఆమె ఇషికా శ్రీ మహాలక్ష్మి ఫౌండేషన్ ద్వారా మహాలక్ష్మి భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల భద్రత, హిందూ సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. తన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు.  ఇప్పుడు యువతను ధర్మమార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తన 'శ్రీ మహాలక్ష్మి ఫౌండేషన్' ఆధ్వర్యంలో 'మహాలక్ష్మి భారత్ అభియాన్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇషికా తనేజా తన కార్యక్రమ ఉద్దేశ్యాలను వివరించారు. "సమాజంలోని వివిధ రంగాలను అష్టలక్ష్మి రూపాలతో అనుసంధానించడమే మా 'మహాలక్ష్మి భారత్ అభియాన్' ముఖ్య లక్ష్యం. గజలక్ష్మి మన మంత్రులకు, వీరలక్ష్మి సైన్యానికి, విజయలక్ష్మి న్యాయమూర్తులకు, సంతానలక్ష్మి నేటి యువతకు, ఐశ్వర్యలక్ష్మి మీడియా, సోషల్ మీడియాకు ప్రతీకలుగా నిలుస్తారు. ఈ అన్ని వర్గాలను ధర్మంతో అనుసంధానించే ప్రయత్నంలో భాగంగానే 8 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం" అని ఆమె తెలిపారు. ఈ ప్రచారంలో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకుంటున్నారని, మన సనాతన ధర్మంలోని గొప్పతనం వల్లే విదేశీయులు కూడా ఆకర్షితులవుతున్నారని ఆమె పేర్కొన్నారు.

సాధ్విగా మారకముందు ఇషికా తనేజా అసాధారణ విజయాలు సాధించారు. 1994లో జన్మించిన ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో విద్యనభ్యసించారు. 2017లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆమె, 2018లో మలేషియాలో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం పోటీల్లో "బిజినెస్ వుమన్ ఆఫ్ ది వరల్డ్" టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. అంతకుముందే, 2014లో కేవలం 60 నిమిషాల్లో 60 మంది మోడల్స్‌కు ఎయిర్‌బ్రష్ మేకప్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. 

మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన "ఇందు సర్కార్" చిత్రంలోని ప్రమోషనల్ సాంగ్‌లో, విక్రమ్ భట్ వెబ్ సిరీస్ "హద్"లో ఆమె నటించారు. మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషికి గాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా "100 విమెన్ అచీవర్స్"లో ఒకరిగా గౌరవం అందుకున్నారు. 


More Telugu News