దారుణం.. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కూతురును చంపిన తండ్రి

  • త్వరలో మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికలు
  • ముగ్గురు కూతుళ్లు ఉండటంతో ఒకరిని తప్పించాలని నిర్ణయం
  • పెద్ద కూతురు ప్రాచీని కాలువలోకి తోసి హత్య చేసిన తండ్రి
సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనే రాజకీయ ఆశతో, కన్న కూతురినే కడతేర్చాడో కసాయి తండ్రి. ప్రస్తుత సర్పంచ్‌ ఇచ్చిన సలహాతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘోర ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, నాందేడ్ జిల్లా ముక్కెడ్ తాలూకా కేరూర్ గ్రామానికి చెందిన పాండురంగ కొండ్‌మంగళే (28) బార్బర్ షాప్ నడుపుతున్నాడు. అతనికి ఒక కుమారుడు, ఆరేళ్ల వయసున్న కవల కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని పాండురంగ ఆశపడ్డాడు. అయితే, మహారాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులు.

దీంతో, మూడో సంతానంగా ఉన్న తన కూతురు ప్రాచిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు ప్రస్తుత గ్రామ సర్పంచ్, అతని స్నేహితుడైన గణేష్ షిండే సలహా ఇచ్చాడు. పథకం ప్రకారం, పాండురంగ తన కూతురు ప్రాచిని బైక్‌పై  తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు తీసుకెళ్లాడు. అక్కడ నిజాంసాగర్ కాలువలో చిన్నారిని తోసి హత్య చేశాడు.

కాలువలో బాలిక మృతదేహం లభించడంతో, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సౌ చైతన్య నేతృత్వంలోని బృందం పాండురంగను విచారించగా, మొదట అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో గట్టిగా ప్రశ్నించడంతో అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు.

మొదట పాపను దత్తత ఇవ్వాలని, ఆ తర్వాత వదిలేయాలని భావించినా.. చివరకు హత్య చేయడమే సరైన మార్గమని తండ్రి, సర్పంచ్ నిర్ణయించుకున్నట్లు కమిషనర్ సౌ చైతన్య తెలిపారు. పాండురంగ ఇచ్చిన సమాచారంతో, అతనికి సలహా ఇచ్చిన సర్పంచ్ గణేష్ షిండేను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.


More Telugu News