ఇప్పుడు రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్‌కు అలాగే వచ్చింది: కేటీఆర్

  • ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదన్న కేటీఆర్
  • పరిస్థితి చూస్తుంటే మళ్లీ ఉద్యమం రోజులు గుర్తుకు వస్తున్నాయని వ్యాఖ్య
  • ఫోన్ ట్యాపింగ్ కేసులో అబద్ధాలు ఒక్కటొక్కటి తేలిపోతున్నాయన్న కేటీఆర్
ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాచారం ఎలా వస్తుందో, నాడు కేసీఆర్ ప్రభుత్వానికి కూడా అలాగే వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ నిన్న రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కదిలారని అన్నారు.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ ఉద్యమ రోజులు గుర్తుకువస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాలనా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, మేడారం జాతర ఏర్పాట్లలో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో వారు చెబుతున్న అబద్ధాలు ఒక్కటొక్కటి తేలిపోతున్నాయని అన్నారు. మొదట వ్యాపారవేత్తలు, ఆ తర్వాత సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేశారని చెప్పారని, ఇప్పుడు ఏమీ లేదని అంటున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన ఖర్మ తమకు లేదని స్వయంగా కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇకనైనా పాలనపై దృష్టి సారించాలని హితవు పలికారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సజ్జనార్ తీర్పు చెప్పడానికి ఆయన జడ్జి కాదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వచ్చిన అభియోగాలపై కోర్టులు తేల్చుతాయని అన్నారు. హైదరాబాద్ నగరంలో పట్టబగలు కాల్పులు, దోపిడీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సహజ వనరుల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. సింగరేణి కుంభకోణం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పష్టమైన సమాధానం రాలేదన్నారు.

బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జి, సీబీఐ విచారణ కోరుతుంటే ఎందుకు వెనక్కి పోతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి కాల్ డేటా తీస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ నిలదీస్తోందని, అందుకే సిట్‌ల పేరిట విచారణలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. పైశాచిక ఆనందం కోసం కేసీఆర్‌ను అంతసేపు విచారణ పేరుతో కూర్చోబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్‌పై కేటీఆర్ పెదవి విరిచారు. ఉపాధి హామీని కుదించారని, ఎరువులు, ఆహార రాయితీ, స్వచ్ఛ భారత్ నిధులు తగ్గించారని ఆరోపించారు. బయో ఫార్మా తయారీకి రూ.10 వేల కోట్లు కేటాయించిన కేంద్రం హైదరాబాద్‌కు రూ.10 కూడా కేటాయించలేదని విమర్శించారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధించిందేమిటని ప్రశ్నించారు. రెండు పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు.


More Telugu News