మాట మార్చిన అఫ్రిదీ.. అప్పుడు విమర్శ, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి జై!

  • టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడొద్దన్న పాక్ ప్రభుత్వం
  • ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపిన మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ
  • క్రీడల్లో రాజకీయాలు వద్దంటూనే స్వరం మార్చడంపై చర్చ
  • ఐసీసీ నిష్పక్షపాతంగా ఉండాలని అఫ్రిదీ డిమాండ్
2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నిర్ణయంపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ స్పందన క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఎప్పుడూ చెప్పే అఫ్రిదీ, ఈసారి మాత్రం తన ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలవడం గమనార్హం.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల‌ 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఐసీసీపై నిరసనగా ఈ మ్యాచ్ ఆడవద్దని పాక్ ప్రభుత్వం తమ జట్టును ఆదేశించింది. దీనిపై అఫ్రిదీ స్పందిస్తూ.. "రాజకీయాలు మూసేసిన తలుపులను... క్రికెట్ తెరుస్తుందని నేను నమ్ముతాను. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ భారత్‌తో ఆడకపోవడం విచారకరం. కానీ, మా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఐసీసీ తన నిష్పాక్షికతను మాటలతో కాకుండా చేతలతో నిరూపించుకోవాల్సిన సమయం ఇది" అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు.

అయితే, ఇదే అఫ్రిదీ ఇటీవలే ఇంగ్లండ్‌లో జరిగిన లెజెండ్స్ టోర్నీలో పాకిస్థాన్‌తో ఆడేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించడాన్ని తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు "క్రీడలు ప్రజలను దగ్గర చేస్తాయి. కానీ ప్రతీ దాంట్లో రాజకీయాలు జోక్యం చేసుకుంటే ఎలా?" అంటూ భారత ఆటగాళ్లపై అసహనం వ్యక్తం చేశాడు. ఇప్పుడు స్వయంగా తమ దేశ ప్రభుత్వం తీసుకున్న రాజకీయ నిర్ణయానికి మద్దతు పలకడం అతడి ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.



More Telugu News